మరో 2 రోజులు చలి తీవ్రత
3 నుంచి 5 డిగ్రీలు పడిపోయే అవకాశం
సాక్షి, హైదరాబాద్: హిమాలయాల నుంచి శీతల గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతున్నారుు. దీంతో వచ్చే రెండు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల మేరకు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. అది బలహీనపడితే ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం బలపడితే మేఘాలు కేంద్రీకృతమై ఉష్ణోగ్రతలు కాస్తంత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల తర్వాత చలి తీవ్రత ఎలా ఉండబోతుందనేది ఉపరితల ఆవర్తనంపైనే ఆధారపడి ఉందని పేర్కొంటున్నారు. ఇక గత 24 గంటల్లో మెదక్‌లో అత్యంత తక్కువగా 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, ఖమ్మంలలో 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. హన్మకొండలో 13 డిగ్రీలు, ఖమ్మంలో 14 డిగ్రీలు రికార్డయ్యాయి. నిజామాబాద్, రామగుండంలలో 14 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యారుు. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో సాయంత్రం 6:00 దాటిందంటేచాలు చలితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటోంది.
దీంతోపాటు చలిగాలులు కూడా వీస్తుండటంతో ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలున్నారుు. వృద్ధులు, పిల్లలు చలి నుంచి రక్షణ పొందకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, ఆస్తమా వంటివి తీవ్రమయ్యే అవకాశం ఉందంటున్నారు. చలి తీవ్రతతో రాష్ట్రంలో విద్యుత్ వాడకం కూడా తగ్గింది. ఏసీలు, ఫ్యాన్ల వాడకం తగ్గగా.. గీజర్ల వాడకం మాత్రం పెరిగింది.