కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు
ఇద్దరికి గాయాలు
కట్టంగూర్ (నకిరేకల్): ఓ ప్రైవేటు బస్సు పల్టీ కొట్టి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామశివారులో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. గోల్డెన్ ట్రావెల్ బస్సు 40 మంది ప్రయాణికులతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరింది. మార్గమధ్యంలోని అయిటిపాముల గ్రామశివారులో మూలమలుపు వద్ద వెనుక నుంచి వచ్చే వాహనాల లైట్ ఫోకస్‌తో కన్‌ఫ్యూజన్‌లో ట్రావెల్ డ్రైవర్ బ్రేక్ వేశాడు. అప్పటికే వర్షం కురుస్తుండటంతో బస్సు టైర్లు స్కిడ్ అయి జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది.
దీంతో తేరుకున్న ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేసి బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడికి చెందిన నీలం బీఎస్ శ్రీనివాస్‌కు, శ్రీకాకుళానికి చెందిన జి.జగన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు మరో పల్టీ కొట్టి ఉంటే పరిస్థితి మరోలాగా ఉండేదని, కాల్వ అంచున బస్సు ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.