కడుపుకోత
కందుకూరు/ కడ్తాల (మహబూబ్‌నగర్) : పండగకు ముందు రోజు ఓ ఇంటి తీవ్ర విషాదం అలుముకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కందుకూరు మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు, వారి మేనమామ దుర్మరణం చెం దారు. వివరాల్లోకి వెళితే.. కందుకూరు మండలం శాయిరెడ్డిగూడెంలో శ్రీలత, చిందం శ్రీశైలం దంపతులకు కూతురు శ్రీజ (8), మణికంఠ (5) ఉన్నారు. ముచ్చర్ల గేట్ సమీపంలోని అక్షరజ్యోతి పాఠశాలలో శ్రీజ 2వ తరగతి, మణికంఠ ఎల్‌కేజీ చదువుతున్నారు. ఇదిలా ఉండగా.. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం రావిచేడ్‌కు చెందిన నరేష్ (28) (శ్రీలత సోదరుడు) సంక్రాతి పండగకు చెల్లెలు, బావలను తీసుకెళ్దామని మంగళవారం ఉదయం బైక్‌పై సాయిరెడ్డిగూడెం వచ్చాడు.
అయితే వ్యవసాయ పనులున్నందున పండగ రోజు వస్తామని వారు చెప్పడంతో మేనల్లుడు, మేనకోడలితో కలిసి స్వగ్రామానికి బయలుదేరాడు. రాత్రి 7.30 గంటలకు ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలోని పోచమ్మగడ్డతండా గేటు వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం అతివేగంతో వచ్చి ఢీకొనడంతో మామతో పాటు మేనల్లుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్ర గాయాల పాలైన శ్రీజను చుట్టుపక్కలవారు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.
ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకుని సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు సాయికుమార్, రాంబాబు పరిశీలించి కేసు దర్యాప్తు చే పట్టారు. కాగా, నరేష్‌కు భార్య కొమురమ్మతో పాటు కూతురు లక్కీ, కుమారుడు చింటు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడ మేనమామ, మేనల్లుడు విగత జీవులుగా పడి ఉండడం చూసి వారు కంటతడిపెట్టారు. మరికాసేపట్లో మామయ్య ఇంటికి వెళ్తామని సంతోషంగా ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో రావిచెడ్, శాయిరెడ్డిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.