హమ్మయ్య.. వేసేశాం | unexpectdly munici polls elections notifications held | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. వేసేశాం

Published Sat, Mar 15 2014 3:15 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

unexpectdly munici polls elections notifications held

అనుకోని విధంగా వచ్చిన ‘మున్సిపోల్స్’లో తొలి ఘట్టానికి తెరపడింది. రాజకీయ పక్షాలు ఇంకా బీ-ఫాంల గుట్టు పూర్తిగా విప్పకపోయినా ఆశావహులు నామినేషన్లు వేసి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. స్క్రూటినీ, ఉపసంహరణల అనంతరం బరిలోని వీరులెవ్వరో తేలనుంది. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో పార్టీల సందడి అంతగా సాగలేదు. ర్యాలీల హంగామాకు బ్రేకులు పడ్డాయి. గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి వారు పత్రాలను సమర్పించి పోరుకు సై అంటున్నారు.
 
 సాక్షి మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో తొలిఘట్టానికి శుక్రవారం తెరపడింది. సాధారణ ఎన్నికలకు ముందు కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో పార్టీలు కొంత గందరగోళానికి గురైనప్పటికిని తేరుకొని సిద్దమయ్యారు. మున్సిపల్, నగర పంచాయతీలకు ఈ నెల 10నుంచి 14 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది.
 
 జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా అచ్చంపేట, కొల్లాపూర్, జడ్చర్ల నగరపంచాయతీలకు ఎ న్నికలు నిర్వహించడం  లేదు. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల మున్సిపాలిటీ ఉండగా, షాద్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్,ఐజా నగర పంచాయతీల్లో నామినేషన్ల స్వీక రణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల సంఘం నిర్వహించింది.
 
 పార్టీ ప్రతిపాదికన ఎన్నికలు జరగనున్న నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల పరిధిలో 206 వార్డులు ఉండగా మొత్తంగా 2,295  నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన శుక్రవారం ఒకరోజే 1363 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం 370 నామినేషన్లు, నారాయణపేటలో 104, గద్వాలలో 238, వనపర్తిలో 149, షాద్‌నగర్‌లో 151, కల్వకుర్తిలో 85, నాగర్‌కర్నూల్‌లో 185, ఐజాలో 81 నామినేషన్ల వంతున మొత్తంగా 1363 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 10 నుంచి 13 వరకు నాలుగు రోజుల వ్యవధిలో 932 నామినేషన్లకు మాత్రమే నమోదయ్యాయి.
 
 ఇంకా వీడని బీ-ఫారమ్ గుట్టు..
 నామినేషన్ల ఉపసంహరణ వరకు బీ-ఫామ్ అందజేయటానికి ఎన్నికల సంఘం గడువు ఇవ్వడంతో చాలా మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలు ఇప్పటి వరకు బీ-ఫామ్‌ను అందజేయలేకపోయాయి. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో అయితే పార్టీలు తీవ్ర గందరగోళం పరిస్థితిలో ఉన్నాయి. మాజీ మంత్రుల మున్సిపాలిటీలైన గద్వాల, వనపర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీలో   అయోమయ పరిస్థితి నెలకొంది.
 
 స్వతంత్రుడు కాస్త...
 మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న పలు పార్టీల అభ్యర్థులకు ముందుగానే పార్టీ నాయకత్వం బీ-ఫామ్స్ ఇవ్వని కారణంగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల కేంద్రానికి రాగా..... అక్కడున్న నాయకులు ఆయన్ను  పార్టీ అభ్యర్థిగానే గుర్తిస్తామని అనగానే జేబులో ఉన్న పార్టీ ఖండువాను మెడపై వేసుకొని ఫోటోలకు పోజులివ్వడం ఆసక్తికరంగా కనబడింది.  
 
 గద్వాల మున్సిపాలిటీలోని 33 వార్డులకు నామినేషన్ల కార్యక్రమం ముగిసేనాటికి టీఆర్‌ఎస్ నుంచి 77 నామినేషన్లు టీడీపీ నుంచి 34, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి 9, ఎంఐఎం నుంచి 7, సీపీఎం, బీఎస్పీ, లోక్‌సత్తా నుంచి ఒక్కొక్కటి వంతున 3 నామినేషన్లు రాగా,  స్వతంత్ర అభ్యర్థుల నుంచి 69 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 15 నుంచి 18 వరకు ఉపసంహరించుకోవడానికి అవకాశముంది. శనివారం నామినేషన్ల స్క్రూటిని కార్యక్రమం కొనసాగనుంది. అదే రోజు సాయంత్రం పోటీల్లో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించడంతో పాటు గుర్తులను కేటాయించనుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement