
'కార్లు వెంబడిస్తున్నాయి.. ప్రాణ రక్షణ లేదు'
వరంగల్: ఆంధ్రప్రదేశ్‌లో తనకు ప్రాణ రక్షణ కరువైందని, తనపై కుట్ర చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆందోళన వ‍్యక‍్తం చేశారు. తనకు ప్రాణరక్షణ కరువైందనే విషయం ప్రపంచానికి తెలియజేయాలనే మీడియా సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం మందకృష‍్ణ ఇక‍్కడ మీడియాతో మాట్లాడుతూ పది రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా ఎమ్మార్పీఎస్ పనిచేస్తోందని, దేశంలో ఎక్కడ తిరిగినా తనను ఎవ్వరూ ఆపలేదని, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తమ స్వేచ‍్ఛను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుక్షేత్రం సభ జరగకుండా అక్కడి మాదిగ ఎమ్మెల్యేలను బెదిరించారని చెప్పారు.
తనకు స్వేచ్ఛతోపాటు ప్రాణ రక్షణ కూడా కరువైందని, గుర్తు తెలియని కార్లు తనను వెంటాడుతున్నాయని సంచలన విషయం చెప్పారు. తనకు రక్షణ కొరకు కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఇది జరగదని, తనను వెంబడించింది ఎవరో సీఎం కేసీఆర్ 24 గంటలలో తేల్చాలని డిమాండ్ చేశారు. నిదితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, వర్గీకరణ చేస్తామన్నారు కాబట్టే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశామని, ఇద్దరూ మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబులాంటి వారు 100 మంది వచ్చినా ఎమ్మార్పీఎస్ ఎదుర్కొంటుందని ఆంద్రప్రదేశ్‌లో చంద్రబాబు తన విధానాలు మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.