బిత్తిరి సత్తిపై దాడి, నిందితుడి అరెస్ట్‌ | Unknown person attacked the Bittiri satti | Sakshi
Sakshi News home page

బిత్తిరి సత్తిపై దాడి, నిందితుడి అరెస్ట్‌

Published Mon, Nov 27 2017 3:08 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

Unknown person attacked the Bittiri satti  - Sakshi - Sakshi

బిత్తిరి సత్తి, నిందితుడు మణికంఠ

హైదరాబాద్‌: తెలంగాణ యాసను బిత్తిరి సత్తి కించపరుస్తున్నాడని ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. సోమవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వీ6 చానల్‌ ముందు ఆ చానల్‌ తీన్మార్‌ యాంకర్‌ కావలి రవికుమార్‌ అలియాస్‌ బిత్తిరి సత్తిపై సికింద్రాబాద్‌ కలాసిగుడకు చెందిన మణికంఠ(26) అనే యువకుడు హెల్మెట్‌తో దాడి చేశాడు. తలకు గాయాలైన బిత్తిరి సత్తిని స్థానికులు వెంటనే స్టార్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు.

కొద్దిరోజులుగా బిత్తిరి సత్తిపై దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించానని, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వీ6 చానల్‌ వద్దకు వచ్చి బిత్తిరి సత్తి కోసం వేచి చూశానని నిందితుడు తెలిపాడు. సరిగ్గా 12.30 గంటలకు సత్తి వీ6 చానల్‌ కార్యాలయం లోపలికి వెళ్తుండగా హెల్మెట్‌తో దాడి చేసినట్లు అంగీకరించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ చానల్‌లో బిత్తిరి సత్తి తెలంగాణ భాషను కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడటం భరించలేకపోయానని నిందితుడు చెప్పాడు. తాను సినిమా దర్శకుడిగా, రచయితగా ఉన్నానని, తాను చదివిన పుస్తకాల్లో బిత్తిరి సత్తి మాట్లాడుతున్న యాస ఎక్కడా కనిపించలేదన్నారు. పనిగట్టుకొని తెలంగాణను బదనాం చేయడానికి సత్తి కంకణం కట్టుకున్నాడని ఆరోపించాడు. తెలంగాణ భాషా గౌరవాన్ని దెబ్బతీయవద్దనే ఈ దాడికి పాల్పడ్డట్లు తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement