
సాక్షి, దేవరకొండ: హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి వచ్చే అక్టోబర్ నెలలో ఉపఎన్నికలు జరగవచ్చని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బుధవారం దేవరకొండలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపఎన్నికల్లో పోలీసులు ఎవరైనా అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందిపెడితే తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామన్నారు. అందుకు తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేస్తూ ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ఉత్తమ్ ప్రశ్నించారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను కచ్చితంగా ఓడించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులన్నీ కమిషన్ల కోసమే చేపట్టారని ఆరోపించారు. కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కేసీఆర్ ఆ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ అసమర్థత కారణంగానే గిరిజనులకు ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్లు దక్కలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ్ బీజేపీపైనా విమర్శలు గుప్పించారు. నెహ్రూను ప్రతిష్టను దిగజార్చడానికి బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడదని, గడిచిన ఐదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment