సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. కార్యనిర్వాహక అధ్యక్షునిగా మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం దక్కనుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఇప్పటికే ఉత్తమ్, భట్టికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అలాగే సీఎల్పీ నేత జానారెడ్డిని హుటాహుటిన ఢిల్లీకి రావాలని కూడా దిగ్విజయ్ ఆదేశించారు. శనివారమే ఈ మార్పులకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని భావించినప్పటికీ రాత్రి పొద్దుపోయేదాకా ఏఐసీసీ స్పందించలేదు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను, సీఎల్పీ నేత జానారెడ్డిని మారుస్తున్నారంటూ కాంగ్రెస్ వర్గాల్లో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
దీనిపై అధిష్టానం కూడా వారం రోజులుగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే పొన్నాలను ఇటీవల ఢిల్లీకి పిలిపించింది. ఆయన నాయకత్వంపై పార్టీ వర్గాల నుంచి వస్తున్న విమర్శలపై చర్చించింది. ముఖ్యంగా పీసీసీ, సీఎల్పీ మధ్య సమన్వయం లేకపోవడంపై ప్రశ్నించినట్లు సమాచారం. పొన్నాల సమాధానంపై సంతృప్తి చెందని అధినాయకత్వం మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్ పదవిని జానారెడ్డి ఆశిస్తున్నప్పటికీ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికే ఆ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని మల్లు భట్టి విక్రమార్కకు అప్పగిస్తారని తెలిసింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దిగ్విజయ్ నివాసం వద్ద శనివారమంతా మీడియా పడిగాపులు కాసింది. చివరకు దిగ్విజయ్ స్పందిస్తూ.. ‘ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వచ్చేదాకా నిరీక్షించండి’ అని పేర్కొన్నారు. మరోవైపు జానారెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడే ఉన్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి అగ్రనేతలు గులాంనబీ ఆజాద్, జైరాం రమేశ్, జైపాల్ రెడ్డిలను కలిశారు. అయితే సీఎల్పీ నేతను మార్చాలంటే ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని, ఆయన నుంచి రాజీనామా తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కాగా, సీఎల్పీ నేత జానారెడ్డికితోడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ పేరు దాదాపు ఖరారవడంతో నల్లగొండ జిల్లాకే రెండు కీలక పదవులు దక్కినట్టయింది.
పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్?
Published Sun, Mar 1 2015 2:29 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement