భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాల వేళ ప్రొటోకాల్ రగడ తలెత్తింది. ఆలయ దర్శనం కోసం సతీ సమేతంగా వచ్చిన మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ దేవస్థానం అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక దశలో సహనం కోల్పోయిన దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతిపై మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, ఇతర ప్రజా ప్రతినిధులు ఉత్తర ద్వారం లోంచి మూల వరుల దర్శనం కోసం వెళ్లారు.
ఆ సమయంలో తనను ఎవ్వరూ పట్టించుకోకపోవటంపై ఎంపీ సీతారాంనాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులకు దేవస్థానం అధికారులు రాచమర్యాదులు చేయటంతో అక్కడనే ఉన్న ఎంపీ దీనిని చూసి ఈవో ఎక్కడంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీపానే ఉన్న ఈవో జ్వోతి అక్కడికి వెళ్లి ఎంపీతో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆయినా ఎంపీ శాంతించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇంకా ఆంధ్ర పాలనే సాగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రామాలయంలో సరైన గౌరవం దక్కడం లేదంటూ ఈఓతో వాదనకు దిగారు. దీంతో తాను కూడా తెలంగాణ బిడ్డనే అని ఈఓ ఎంపీకి వివరించారు.
దేవస్థానంలో ఆంధ్రపాలనే సాగుతోంది : ఎంపీ సీతారాంనాయక్
వీఐపీ అయిన నాకు ఓ దండేసి పక్కన కూర్చోబెట్టారు. భద్రాచలం దేవస్థానంలో ఆంధ్ర పాలనే సాగుతోంది. తెలంగాణ బిడ్డలకు ఏమాత్రం గౌరవం ఇవ్వటం లేదు. అందుకనే దేవస్థానం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది.
సమాచారం లేకనే.. : ఈఓ జ్యోతి
ఉత్తర ద్వార దర్శనం సమయంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఇచ్చాం. కానీ ఎంపీ దర్శనం కోసం వచ్చేటప్పుడు ఆయన పీఏలైనా ముందస్తు సమాచారం ఇచ్చి ఉండాల్సింది. అప్పుడు తప్పనిసరిగా ఆయన్ను ఆహ్వానించే వాళ్లం. ఈ విషయంలో మా తప్పేమీ లేదు.
ప్రొటోకాల్ రగడ
Published Fri, Jan 2 2015 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement