భావన లహోటి
సాక్షి, విజయవాడ: మిసెస్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన భావన లహోటి విజయం సాధించారు. పెళ్లి అయిన మహిళలకు నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందడం ద్వారా 27 ఏళ్ల భావన విజయవాడ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సాధించారు. అందం, ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, ర్యాంప్ వాక్‌లలో బెజవాడ మహిళలు ఏమాత్రం తీసిపోరని భావన నిరూపించారు. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి వరకు జరిగిన ఈ పోటీల్లో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 111 మంది మహిళలు పాల్గొన్నారు.
ఈ పోటీల్లో భావన కిరీటాన్ని కైవసం చేసుకోవటంతో పాటు మిసెస్ ఇండియా పోటీలకు అర్హత సాధించారు. కూచిపూడి నాట్యంలో పట్టభద్రురాలైన భావన.. గౌరవ డాక్టరేట్‌తో పాటు 22 స్టేట్, నేషనల్ అవార్డులను పొందారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన సినిమా బాహుబలిలో శాస్త్రీయ నృత్యాలకు భావన కొరియోగ్రఫీ చేశారు. గతంలో పదేళ్లపాటు టీవీ రిపోర్టర్‌గా పని చేశారు. క్లాసిక్ మిసెస్ ఇండియా తెలంగాణ కిరీటాన్ని రాధిక అగర్వాల్ దక్కించుకున్నారు. సూపర్ క్లాసిక్ మిసెస్ ఇండియా తెలంగాణ టైటిల్‌ను డాక్టర్ శోభ, పద్మజ కొడారి సంయుక్తంగా గెల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment