ఓ మంచి డాక్టరమ్మ -మిసెస్ తెలంగాణ
సేవకు అందమైన మాధ్యమం
మిసెస్ తెలంగాణ తెచ్చిన సెలబ్రిటీ గుర్తింపుతో ఒక డాక్టర్‌గా, ఒక మహిళగా నా వంతు సామాజిక బాధ్యత అని నేను చేపట్టిన అనేక కార్యక్రమాలను ఇంకా వేగంగా తీసుకువెళ్లగలుగుతాను. వయలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. జెండర్ ఈక్వాలిటీ కోసం పని చేస్తున్నాను. భ్రూణ హత్యలకు కారణం అమ్మాయంటే ఇష్టం లేక కాదు. సమాజంలో అఘాయిత్యాలు పెచ్చుమీరిన ఈ రోజుల్లో అమ్మాయిని భద్రంగా పెంచగలమా లేదా అనే భయమే ప్రధాన కారణమని అనేక మంది మహిళల మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎన్జీవోలతో కలిసి తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే ఆడపిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడం, అబ్బాయిలను సెన్సిటైజ్ చేస్తున్నాను. ఇక ఇలాంటి కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతాను. – డాక్టర్ స్రవంతి గాదిరాజు, అసోసియేట్ ప్రోఫెసర్, లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జన్, గైనిక్ ఆంకాలజిస్ట్
డాక్టర్ స్రవంతి గాదిరాజు... తెలంగాణ, నిజామాబాద్‌లో డాక్టర్. యూఎస్‌లో గైనిక్ ఆంకాలజీ చేసి తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీ మహిళల్లో ఎదురవుతున్న సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలన కోసం పని చేస్తున్నారు. ‘డాక్టర్ తన ఉద్యోగం హాస్పిటల్లోనే అనుకుంటే సమాజం సంపూర్ణ ఆరోగ్యవంతం కాలేదు. పేషెంట్లను వెతుక్కుంటూ వైద్యులు వెళ్లగలగాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం.
అందుకోసమే ఆదివాసీలు ఎక్కువగా నివసించే, ఆరోగ్యం పట్ల కనీస అవగాహన లేని వారి ఇళ్ల ముందుకు వెళ్తున్నాను. ఆరోగ్య పరిరక్షణ అవసరాన్ని తెలియచేస్తున్నాను. నాలోని ఈ గుణమే నన్ను మిసెస్ తెలంగాణ పోటీల్లో విజేతగా నిలిపింది. నేను బ్యూటీ కాంటెస్ట్‌ల వైపు అడుగులు వేయడం సెలబ్రిటీ గుర్తింపు కోసం కాదు. ఒకవేళ సెలబ్రిటీ గుర్తింపు వస్తే... ఆ గుర్తింపుతో సమాజంలో నేను కోరుకున్న మార్పు కోసం పని చేయడం సులువవుతుంది. బ్యూటీ పజంట్గా ఇప్పుడు నేను సమాజానికి చేస్తున్న వైద్యసేవలను మరింత త్వరగా విస్తరించగలుగుతాను’ అన్నారు ‘సాక్షి’తో డాక్టర్ స్రవంతి.
పేషెంట్ల దగ్గరకు వెళ్లాలి!
ఈ రోజు మీకు కనిపిస్తున్న ఈ విజేత గుర్తింపు అన్నది నేను సాధించిన ఘనత అని అనుకోను. మా అమ్మానాన్నలు తీర్చిదిద్దిన కూతుర్ని. అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్. నాన్న విజయ డైరీలో మేనేజర్. అమ్మ తన డ్యూటీ విషయంలో ఎంత కచ్చితంగా ఉండేదో, తన సలహా సూచనల కోసం వచ్చిన వారిని ఎంత ఆప్యాయంగా చూసుకునేదో దగ్గరగా చూశాను. ప్రభావతక్క అని అందరూ ఆమెని సొంత అక్కలా అభిమానించేవారు. అమ్మతోపాటు హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు డాక్టర్ కనిపించగానే పేషెంట్లు సంతోషంగా కృతజ్ఞత వ్యక్తం చేయడం చూసి అమ్మను అడిగితే, డాక్టర్‌ను దేవుడిలా చూస్తారని చెప్పింది.
అంతే! ఇది అత్యుత్తమమైన వృత్తి అనే అభి్రపాయం స్థిరపడిపోయింది. అమ్మకు నైట్ షిఫ్ట్లుండేవి. అప్పుడు నాకు జడలు వేయడం నుంచి బాక్స్‌లు పెట్టడం వరకు మా నాన్నే చేశారు. మా అన్నయ్యను, నన్ను పెంచడం, చక్కగా తీర్చిదిద్దడం కోసమే వాళ్ల జీవితాలను అంకితం చేశారు. నేను సిక్త్స్ క్లాస్ వరకు విజయవాడలో చదివాను. ఉద్యోగాల్లో బదిలీలతో గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ అన్నీ చూశాం. నెల్లూరులోని కస్తూరిదేవి విద్యాలయం నాకు బాగా గుర్తున్న స్కూలు.
ఎమ్సెట్ తొలి ప్రయత్నంలో మంచి ర్యాంకు రాలేదు. అప్పుడు అమ్మ ‘మనది మధ్యతరగతి కుటుంబం. డొనేషన్ సీట్లతో చదివించలేం. బీఎస్సీలో చేరి మళ్లీ ప్రయత్నం చెయ్యి. అప్పుడూ రాకపోతే డిగ్రీ పూర్తి చెయ్యి’ అని కరాకండిగా చెప్పి డిగ్రీలో చేర్చింది. ఆ ఉక్రోషంతో చేసిన రెండవ ప్రయత్నంలో తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో ఫ్రీ సీటు వచ్చింది. తొలి పోస్టింగ్ అనంతపురం జిల్లా రాకట్ల డిస్పెన్సరీలో. అప్పుడు కూడా మార్గదర్శనం చేసింది అమ్మే. ప్రైవేట్ డాక్టర్ క్రేజ్ ఉండేది నాకు. గవర్నమెంట్ ఉద్యోగం విలువ తెలుసుకోమని గట్టిగా చెప్పింది.
గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టే ఉద్యోగం చేస్తూ మధ్యలో సెలవు పెట్టుకుని యూఎస్‌లో కోర్సులు చేయడం సాధ్యమైంది. అంతేకాదు. గవర్నమెంట్ ఉద్యోగం వల్ల మారుమూల ప్రదేశాలను దగ్గరగా చూడడం, అక్కడి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం వల్ల, ఉద్యోగ పరిధి దాటి బయటకు వచ్చి మరింత ఎక్కువగా సర్వీస్ చేయాల్సిన అవసరం తెలిసి వచ్చింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి మహిళలకు మెన్స్ట్రువల్ హైజీన్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడానికి పాప్‌స్మియర్ పరీక్షలు చేయడం, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంలో బిజీ అయిపోయాను. నేను రోబోటిక్ గైనిక్ ఆంకాలజిస్ట్‌ని. సర్వైకల్ క్యాన్సర్‌ను రూపుమాపాలనేది నా లక్ష్యం. ఈ నెల బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా శిల్పకళావేదికలో బ్యూటీ పజంట్స్ అందరం అవేర్నెస్ ర్యాంప్ వాక్ చేస్తున్నాం.
సావిత్రినయ్యాను!
ఇక బ్యూటీ పజంట్ విషయానికి వస్తే... నాకు చిన్నప్పటి నుంచి స్కూలు, కాలేజ్ పోటీల్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం ఇష్టం. డాన్స్, పెయింటింగ్‌తోపాటు కాలేజ్‌లో ర్యాంప్ వాక్ కూడా చేశాను. మిసెస్ ఇండియా పోటీల గురించి చాలా ఏళ్లుగా పేపర్లో చూడడమే కానీ పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ మమతా త్రివేది నిర్వహిస్తున్న కాంటెస్ట్ గురించి తెలిసి గత ఏడాది నవంబర్‌లో నా ఎంట్రీ పంపించాను.
కొత్తతరం పిల్లలు చాలా స్మార్ట్‌గా ఉంటున్నారు. మా పెద్దమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తోంది. తను నన్ను ఈ పోటీలకు సిద్ధం చేసింది. మా హజ్బెండ్ నా క్లాస్మేట్, దూరపు బంధువు కూడా. ఎమ్ఎన్జేలో డాక్టర్. నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. మొత్తం ఇరవై రౌండ్లు కొన్ని ఆన్లైన్, కొన్ని ఆఫ్‌లైన్‌లో జరిగాయి. ఆహార్యం రౌండ్లో మహానటి సావిత్రిని తలపించాలని టాస్క్ ఇచ్చారు. సావిత్రి పాత్రలో మెప్పించడమే నన్ను విజేతను చేసింది.
మా తోటి పీజంట్లు నన్ను సావిత్రి అనే పిలుస్తున్నారిప్పుడు. నా స్మైల్‌కి కూడా ఈ పోటీల్లో మంచి గుర్తింపు వచ్చింది. విజేతలను ప్రకటించేటప్పుడు మాత్రం నర్వస్ అయ్యాను. నా ముఖంలో నవ్వు విరిసే తీర్పు వచ్చింది’’ అని చక్కగా నవ్వారు సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, మిసెస్ తెలంగాణ విజేత డాక్టర్ స్రవంతి. రాబోయే డిసెంబర్లో జరిగే ‘మిసెస్ ఇండియా’ పోటీల్లో ఆమె తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు. ‘మిసెస్ ఇండియా’ కిరీటం ఆమె కోసం ఎదురు చూస్తోందేమో!.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి