వందెకరాల ప్రభుత్వ భూమికి కంచె
జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లోని మాల్కారం సమీపంలో ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా భూపరిరక్షణ విభాగం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ విఠల్ తెలిపారు. ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ దేవుజానాయక్‌లతో కలిసి శుక్రవారం ఆయన జవహర్‌నగర్‌లోని ప్రభుత్వస్థలాలను సందర్శించారు. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు.
అందులో భాగంగానే ఇటీవల సర్వే చేసిన జవహర్‌నగర్‌లోని రాజీవ్‌స్వగృహ సమీపంలోని మల్కారం పరిధిలో గల 100 ఎకరాల ప్రభుత్వ స్థలానికి కంచె ఏర్పాటు చేయనున్నామన్నారు. మల్కారం, అంబేద్కర్‌నగర్, చెన్నాపురం చెరువులను పరిశీలించి మండలంలోని అన్ని చెరువుల పరిరక్షణ కోసం కంచెను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శామీర్‌పేట మండల సర్వేయర్ శ్రీనివాసచారి, జవహర్‌నగర్ రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ రాజు, వీఆర్‌ఓలు ఆనంద్, వెంకటేష్‌లతో పాటు రెవిన్యూసిబ్బంది పాల్గొన్నారు.