సాక్షి, హైదరాబాద్: ఎన్కౌంటర్లు హత్యలకు ప్రత్యామ్నాయ పదంగా మారాయని, టేకులపల్లి హత్యాకాండను ఖండిస్తున్నామని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు చెప్పారు. ఇవి, ఎన్‌కౌంటర్ పేరున జరిగిన హత్యలని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ వెంగళరావు కాలాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రేహౌండ్స్, పారామిలటరీ దళాలు ఎందుకు ఉపయోగిస్తున్నారని ఆయన నిలదీశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టఫ్, విరసం, పౌరహక్కుల సంఘం, తెలంగాణ ప్రజాఫ్రంట్ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరంప్రజా సంఘాల నాయకులు విమలక్క, నలమాస కృష్ణ, లక్ష్మణ్ తదితరులతో కలసి వరవరరావు విలేకరులతో మాట్లాడారు.
ఇళ్లనుంచి పట్టుకొని వచ్చి మరీ ఆదివాసీ విద్యార్థులను చిత్రహింసలు పెట్టి, హత్యలు చేసి ఎన్‌కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలంటే మావోయిస్టులుగా, మావోయిస్టులంటే ఆదివాసీలుగా ముద్రవేస్తున్నారని ఆరోపించారు. టేకులపల్లి కాల్పుల ఘటనపై హత్యానేరం నమోదు చేసి, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న సోయం బాబూరావును అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఆదివాసులకు లంబాడీలకు మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం తమాషా చూస్తోందని వరవరరావు విమర్శించారు.
పౌరహక్కుల సంఘం నేత లక్ష్మణ్ మాట్లాడుతూ ఇళ్ల నుంచి పట్టుకొచ్చిన వారిని ఎన్‌కౌంటర్ పేరున హత్య చేయడం అమానుషమని విమర్శించారు. స్వయంప్రతిపత్తి గల ఒక విచారణ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరవాత జరిగిన పెద్ద మారణకాండ ఇదని, హక్కుల కోసం మాట్లాడుతున్న వారిని, ప్రశ్నించే గొంతులను లేకుండా చేస్తున్న హత్యలని నలమాస కృష్ణ అభిప్రాయపడ్డారు. భూమిని, ఖనిజ సంపదను తాకట్టు పెడుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఎన్‌కౌంటర్ పేర హత్యలు చేస్తున్నారని అరుణోదయ విమలక్క విమర్శించారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి మధ్యాహ్నం వరకు మీడియాను, ప్రజలను ఆ ప్రదేశానికి ఎందుకు రానివ్వలేదని ఆమె ప్రశ్నించారు. ఆదివాసీలపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు విద్యార్థులయిన ఆదివాసీలను హింసించి హత్య చేశారని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఆమె ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో న్యూడెమొక్రసీ పరశురాం, పీడీఎస్‌యూ నేత గౌతమ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment