
వస్తున్నమయ్యా.. కురుమూర్తి రాయా!
చిన్నచింతకుంట:
పాలమూరు ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా కొలిచే కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు జరిగే ఈ జాతరకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లుపూర్తిచేశారు. స్వామివారి ప్రధాన ఆలయం, ముఖద్వారానికి రంగులు వేశారు.
లక్ష్మీదేవి ఆలయం, దిగుడుమెట్లు, ఉద్దాల మండపం, యాగశాలను ముస్తాబుచేశారు. స్వామివారు ఊరేగే వివిధ వాహన సేవలను శుద్ధిచేశారు. విడిదిసత్రాలు, గోవింద నిలయం, బారి కేడ్లు, కల్యాణ మండపానికి రంగులువేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని వసతులు కల్పించారు. నూతన వాటర్‌ట్యాంకు నిర్మాణం, జాతర ప్రాంతంలో అక్కడడక్కడ కుళాయిలను ఏర్పాటుచేశారు. భక్తులు స్నానాలు చేసేందుకు రామన్‌పాడు నీటితో కోనేరును నింపారు. ప్రతిరోజు కోనేరులో బ్లీచింగ్‌పౌడర్, సున్నం చల్లుతున్నారు. కాగా, ఇప్పుడిప్పుడే వ్యాపారులు జాతరకు చేరుకుంటున్నారు. హోటళ్లు, ఆట వస్తువుల విక్రయశాలలను సిద్ధంచేసుకుంటున్నారు.