సాక్షి,సిటీబ్యూరో: మండుతున్న ఎండలతో పాటే కూరగాయల ధరలు సైతం భగ్గుమంటున్నాయిు. నగరంలో మార్కెట్లలో టమాటా కిలో రూ.50 నుంచి రూ.60కి ఎగబాకింది. బిన్నీస్ కిలో రూ.100 నుంచి రూ.120 మధ్య ఉంది. మిగిలిన కూరగాయల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. దీంతో నగరవాసులు కూరగాయలు కొనాలంటే భయపడుతున్నారు. ధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతుండడతంతో ప్రజలు బంబేలెత్తి పోతున్నారు. వేసవిలో సాధారణంగా కూరగాయల దిగుబడి తక్కువగా ఉంటుంది. గతంలో తెలంగాణ జిల్లాల్లో ఉత్పత్తి లేనప్పుడు పక్క రాష్ట్రాల నుంచి నగర మార్కెట్లకు అవసరమైన సరుకు దిగుమతి చేసుకునేవారు. అయితే, ప్రస్తుత వేసవి సీజన్‌లో ఆయా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో కూరగాయల సాగు తగ్గిపోయింది. దీంతో ఉన్న సరుకును వ్యాపారులు భారీగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. జంట నగరాలకు ప్రతిరోజుకు 15 నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల డిమాండ్ ఉండగా ప్రస్తుతం 50 శాతం కూడా సరఫరా కావడం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓ పక్క నీటి కొరత, మరో పక్క ఎండల తీవ్రత పంటపై పడిందని, గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. వర్షాలు కురిస్తే గాని సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం లేదంటున్నారు. నిత్యం తెలంగాణ జిల్లాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయలతో కళకళలాడే హైదరాబాద్ మార్కెట్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు పంటలు వేసే పరిస్థితి లేదు. దీంతో నగర అవసరాలకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపైనే ఆధార పడాల్సి వస్తోంది.
జూన్ చివరి వరకు ఇదే పరిస్థితి
ప్రతి వేసవిలో కొన్నిరకాల కూరగాయల కొరత ఉంటుంది. దీంతో మార్కెట్‌కు వచ్చే అరకొర కూరగాయలకు ధరలు కూడా పెరుగుతుంటాయి. ఈసారి మాత్రం ఇంత భారీస్థాయిలో కూరగాయల కొరత ఏర్పడుతుందని ఊహించలేదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి టమాటా, బిన్నీస్, క్యాప్సికం సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కొన్ని రోజుల క్రితం వరకు నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి రోజూ 40 నుంచి 50 లారీల టమాటా దిగుమతి కాగా, ప్రస్తుతం 10 లారీలు మించడం లేదు. దీంతో బెంగళూరు, బెల్గాం, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి నగరానికి రోజుకు 30 నుంచి 35 లారీల టమాటా దిగుమతి చేస్తున్నారు. బిన్నీస్ నెల రోజుల క్రితం రోజుకు 2 నుంచి 4 టన్నులు దిగుమతి కాగా, ప్రస్తుతం టన్నుకు మించి రావడం లేదు. దీంతో వీటి ధరలు విపరీతంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. చిక్కుడుకాయ కూడా మార్కెట్‌లో కనిపించడం లేదు. ప్రస్తుత ఆఫ్ సీజన్‌లో స్థానికంగా కూరగాయల దిగుమతులు ఎక్కువగా ఉండవు. దీంతో కమీషన్ ఏజెంట్లు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు కూరగాయలు తెప్పిస్తారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకే కొనాల్సి వస్తోంది.
సాగు లేకే అధిక ధరలు
ఏప్రిల్ నుంచి నగర శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతి తగ్గిపోయింది. మే నెలలో డిమాండ్ ఉన్నా సరఫరా 30 శాతం మించదు. సాధారణంగా వేసవిలో ఎండలు కారణంగా తోటలకు నీరు అందదు. దీంతో కూరగాయల సాగు అంతగా ఉండదు. నగర కూరగాయల అవసరాలు తీర్చాడానికి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేస్తున్నాం. టమాటా ధరలను నియత్రించడానికి ఢిల్లీ నుంచి దిగుమతి చేసేందుకు ప్రణాళిక చేశాం.– కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్
Comments
Please login to add a commentAdd a comment