ఆటోలకు వాహన పన్ను మినహాయింపు
ట్రాక్టర్లు, ట్రాలీలకు కూడా వర్తింపు రూ.76.26 కోట్ల బకాయిల రద్దు
హైదరాబాద్: ఆటోలు, ట్రాలీ ఆటోలు, వ్యవ సాయ పనులకు వినియోగించే ట్రాక్టర్లు, ట్రాక్టర్ ట్రాలీల యజమానులకు శుభవార్త. వీటిని వాహన పన్ను నుంచి మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఆటోలతోపాటు సెవెన్‌సీటర్ ఆటోలకూ ఇది వర్తిస్తుంది. త్రైమాసిక పన్ను భారంగా పరిణమించిందని, దాన్ని మినహాయిస్తే తమకు కొంత వెసులుబాటు కలుగుతుందని గతంలో ఆటోల యజమానుల జేఏసీ చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిం చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ జూన్ రెండో తేదీ నాటికి ఈ వాహనాలకు సంబంధించి పేరుకుపోయిన రూ.76.26 కోట్ల పన్ను బకాయిలు రద్దు చేశారు.
గత జూలైలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటికి పన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆటోల ద్వారా రవాణా శాఖకు సంవత్సరానికి పన్ను రూపంలో రూ.10 కోట్ల ఆదాయం వస్తుంది. అలాగే వ్యవసాయ అవసరాలకు వాడుతున్న ట్రాక్టర్లు, ట్రాలీలకు రూ.300 పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తం ఇప్పుడు రద్దయింది. ఎన్నికలప్పుడు టీఆర్‌ఎస్ ఈ అంశానికి సంబంధించి హామీ ఇచ్చింది.
ఆర్టీసీకి మినహాయించాలి: ఎన్‌ఎంయూ
ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాలీల పన్ను మినహాయిస్తూ నిర్ణయించిన తరహాలోనే.. ఆర్టీసీ బస్సులపై విధిస్తున్న ఎంవీ టాక్స్‌ను రద్దు చేయాలని ఆర్టీసీ ఎన్‌ఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్‌లు ప్రభుత్వాన్ని కోరారు.