రేపోమాపో డీఎస్సీ నోటిఫికేషన్ | very soon dsc notification | Sakshi
Sakshi News home page

రేపోమాపో డీఎస్సీ నోటిఫికేషన్

Published Mon, Mar 14 2016 1:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

very soon dsc notification

మండలిలో సీఎం వెల్లడి
► డీఎడ్, బీఎడ్ కాలేజీల నుంచి ఏటా 40 వేల మంది వస్తున్నారు
► వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా?
► ఎందుకు అన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చారు?
► ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నీ తీర్చేస్తాం
► 2016-17 విద్యా సంవత్సరంలో నెలనెలా ఫీజులు చెల్లిస్తాం


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 10 వేల టీచర్ పోస్టుల భర్తీకి రేపోమాపో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆదివారం శాసన మండలిలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. త్వరలోనే విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 477 డీఎడ్, బీఎడ్ కాలేజీల నుంచి ఏటా 40 వేల మంది బయటకు వస్తున్నారని, వారందరికీ  ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఎందుకు అన్ని కాలేజీలకు అనుమతి ఇచ్చారు? అంత అనాలోచితంగా ఎందుకు ఏర్పాటు చేశారంటూ గత ప్రభుత్వాలను విమర్శించారు. విద్యార్థుల్లో ఆశ రేకెత్తించి, ఉద్యోగాలు ఇవ్వకుండా వార ంతా ఆందోళన వైపు వెళ్లేలా చేశారన్నారు. విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు పెంచే కోర్సులను ప్రవేశపెట్టేలా ఆలోచించాలి తప్ప రాజకీయాల కోసం మాట్లాడవద్దని సూచించారు.

నాస్కామ్ మీటింగ్‌లో తల దించుకున్నా
 రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని సీఎం అన్నారు. ‘‘గతంలో నేను నాస్కామ్ సమావేశానికి వెళ్లా. ‘కోళ్ల ఫారాలు, డెయిరీ ఫారాలు కాలేజీలు అయ్యాయి. దేశవ్యాప్తంగా 100 నకిలీ సర్టిఫికెట్ అభ్యర్థులు దొరికితే అందులో 75 హైదరాబాద్ నుంచే ఉన్నాయి’ అని వాళ్లు చెప్పారు. ఆ విషయాలు విని తలదించుకోవాల్సి వచ్చింది. దీనిపై పోలీసులతో మీటింగ్ పెట్టి చెబితే వాళ్లు నాలుగైదు నకిలీ సర్టిఫికెట్ గ్యాంగులను పట్టుకున్నారు. అలాగే 390 బోగస్ కాలేజీలు మూతపడ్డాయి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది’’ అని వివరించారు. 6 వేల కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,300 కోట్లు ఇవ్వాల్సి వస్తోందని, అది బోగస్ కాలేజీలకు, దళారులకు కాకుండా అసలైన వారికే అందాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఫీజుల కోసం ప్రభుత్వంలో ఇతరులు వచ్చి పైరవీ చేసే దుస్థితి పోవాలి. అందుకు ప్రతినెలా బడ్జెట్ విడుదల కావాలి. ఇప్పటివరకు  ఉన్న ఫీజు బకాయిలు అన్నింటిని మార్చి లేదా ఏప్రిల్ నెల నాటికి విడుదల చేస్తాం. బకాయి లేకుండా చేస్తాం. వాటన్నింటిపైనా విచారణ చేయిస్తాం. అంతా సహకరించాలి. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నెలా ఫీజులు చెల్లిస్తాం’’ అని సీఎం చెప్పారు. ముఖ్యమం త్రి సమాధానం అనంతరం ధన్యవాద తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement