సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసమే ముందుకు సాగింది. చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డా, మొక్కవోని దీక్షతో ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వారి జీవితం యువతకు ఆదర్శనీయం. ఆయన మంచి వక్త, అపారమైన మేధస్సుతో పాటు అందరినీ ఆకట్టుకునే విశ్లేషణ వారి సొంతం. తెలుగు, ఆంగ్ల భాషల్లో వారి ప్రావీణ్యం అమోఘమైనది. వారి వ్యక్తిత్వం, ప్రజా సమస్యలను చూసే కోణం, మాట్లాడే విధానం మా ఇద్దరినీ మంచి మిత్రులుగా మార్చింది. అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు జైపాల్ రెడ్డి గారిది విలక్షణమైన బాణి. దక్షిణాది నుంచి తొలిసారిగా ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని అందుకున్నది కూడా వారే. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment