శిబేరాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ప్రాదేశిక ఫలితాల్లో ఈసారి గరిష్టంగా 28 మండలాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో ఒకరి సభ్యులను మరొకరు లాగేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆందోళన అన్ని పార్టీల్లోనూ నెలకొంది. దీంతో ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. పదవులు ఆశిస్తున్న నేతలు ఎంపీటీసీ సభ్యులను శిబిరాలకు తీసుకెళ్లారు. వీరిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు తిప్పుతున్నారు. ఎన్నికలు శుక్రవారమే కావడంతో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కొందరు ఇతర రాష్ట్రాలకూ తరలివెళ్లారు. మొత్తానికి క్యాంపులు నిర్వహిస్తున్న నేతలకు ఖర్చులు మాత్రం తడిచి మోపెడు అవుతున్నాయి.
జిల్లాలో 59 మండలాలకుగాను కాంగ్రెస్ పార్టీ 25 చోట్ల సొంతంగా పాలకవర్గాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సాధించింది. టీఆర్‌ఎస్‌కు కేవలం 3 మండలాల్లోనే పాలకవర్గాలను ఏర్పాటు చేసేంత మెజారిటీ ఉంది. 28 మండలాల్లో ఏపార్టీకి పూర్తి మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. దీంతో అధికార టీఆర్‌ఎస్ ఈ ‘హంగ్’ మండలాలను తన ఖాతాలో వేసుకునేందుకు ఎత్తులు వేస్తోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ల సాయంతో మండలాలను దక్కించుకుని పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు పక్కా వ్యూహంతో ఉంది. అధికార పార్టీ కావడం, స్థానికంగా ఎమ్మెల్యే కూడా ఉండడం వంటి కారణాలతో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎంపీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్‌కే జై కొట్టేందుకు అవకాశాలు ఉన్నాయి.
గులాబీ జెండా... రెపరెపలాడేనా !
సంస్థాన్‌నారాయణపురం మండలంలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎంపీటీసీ సభ్యులు ఏడుగురు. టీఆర్‌ఎస్‌కు నలుగురు ఉండగా,మరో ఆరుగురు ఇండిపెండెంట్లు ఉండగా, వారిలో ముగ్గురిని తమవైపు లాగేసుకునే పనిలో ఉన్నారు. నాంపల్లి మండలం అధ్యక్ష పదవిని దక్కించుకోవాలంటే 7 సీట్లు కావాలి. కాగా, టీఆర్‌ఎస్‌కు 4 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ చేతిలో 5 సీట్లున్నా, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచారు. వీరిని టీఆర్‌ఎస్ తమలో కలిపేసుకునే అవకాశం ఉంది. వీరు మొగ్గితే ఈ మండలమూ టీఆర్‌ఎస్ ఖాతాలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. యాదగిరిగుట్ట మండలంలో పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 9 సీట్లు కావాలి. కాగా, ఇక్కడ టీఆర్‌ఎస్ చేతిలో 8 సీట్లు ఉన్నాయి. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. దీంతో ఒక్కరి మద్దతు పొందితే చాలు ఈ మండలమూ టీఆర్‌ఎస్ వశమవుతుంది. రాజాపేట మండలంలో పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 6 సీట్లు అవసరం. టీఆర్‌ఎస్‌కు 5 సీట్లున్నాయి. మరో ఇండిపెండెంటు కూడా ఉన్నారు. ఈయన మద్దతుతో మండల అధ్యక్ష పదవి టీఆర్‌ఎస్ కైవసం చేసుకోనుంది.
తుర్కపల్లి మండలంలో టీఆర్‌ఎస్ 5 సీట్లు గెలుచుకున్నా, పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సీటు తక్కువగా ఉండడంతో ఇతరుల వైపు చూస్తోంది. ఒక సీటు చేతిలో ఉన్న టీడీపీ మద్దతు కూడగ ట్టడం కానీ, లేదంటే 4 సీట్లున్న కాంగ్రెస్ నుంచి ఒకరిని లాగేసుకోవడం కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్ చేయాల్సి ఉంది. గుండాలలో ఆరు సీట్లున్న వారే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాగా, టీఆర్‌ఎస్ చేతిలో 4 సీట్లున్నాయి. కాంగ్రెస్, సీపీఐలకు చెరో రెండు సీట్లున్నా, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉండడంతో వారికి టీఆర్‌ఎస్ గాలం వేస్తోంది. ఇదే జరిగితే, ఈ మండలమూ టీఆర్‌ఎస్ ఖాతాలో చేరినట్లే. అర్వపల్లి మండలంలో ఏడుగురు ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉంటే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ, టీఆర్‌ఎస్ చేతిలో 5 సీట్లే ఉండడంతో, 3 సీట్లున్న ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకొనే పనిలో ఉన్నారు.