
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ నష్టాలబాట పట్టడంలో మేనేజింగ్ డైరెక్టర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఆ సంస్థ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ సంస్థ ఎండీకి నిరసన నోటీసును అందించినట్లు విజయ డెయిరీ సిబ్బంది, వర్కర్స్ బి–22, అధికారుల జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిరసనలో భాగంగా శనివారం నుంచి గేట్ మీటింగ్, మహాధర్నా, పెన్‌డౌన్, నిరాహారదీక్షలు, రిలే నిరాహారదీక్షలు, నల్లబ్యాడ్జీలు ధరించడం, అర్ధనగ్న నిరసనలు చేస్తామని సంఘం నేతలు శ్రీనివాస్, యాదయ్య వెల్లడించారు.
కొత్త పంపిణీ పద్ధతి ద్వారా తెలంగాణ విజయ డెయిరీ పాల విక్రయాలు 4.20 లక్షల నుంచి 3.60 లక్షల లీటర్లకు పడిపోయినట్లు వివరించారు. దీంతో నెలకు రూ. 12 కోట్లు నష్టం వాటిల్లుతుందన్నారు. డెయిరీ నష్టాలకు ప్రస్తుత ఎండీ ఏకపక్ష నిర్ణయాలే కారణమని, అందువల్ల తక్షణమే ఎండీని బదిలీ చేయాలని కోరారు.