పాలమూరులో వాలీబాల్‌ అకాడమీ?  | Volley Ball Academy May Grant Shortly For Mahabubnagar | Sakshi
Sakshi News home page

పాలమూరులో వాలీబాల్‌ అకాడమీ? 

Published Fri, Dec 20 2019 9:43 AM | Last Updated on Fri, Dec 20 2019 9:43 AM

Volley Ball Academy May Grant Shortly For Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రీడలు: వాలీబాల్‌ క్రీడను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 2004లో రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ వాలీబాల్‌ అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ ఉన్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. ఇక్కడ శిక్షణపొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయస్థాయిల్లో సత్తాచాటారు. మరికొంత మంది క్రీడాకారులు శిక్షణ పొంది మేటి క్రీడాకారులుగా జాతీయ సీనియర్‌ వాలీబాల్‌ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

అకాడమీ ఉన్న సమయంలో క్రీడాకారులకు ఎంతో అనువుగా ఉండేది. అయితే నిధుల నిర్వహణ భారం కావడంతో 2008లో శాప్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌) అకాడమీని మూసివేశారు. అకాడమీకి కోచ్‌ల కొరత, నిధులలేమి, నిర్వహణ భారంతో రాష్ట్రస్థాయిలో ఉన్న వాలీబాల్‌ అకాడమీలను తీసివేశారు. దీంతో మహబూబ్‌నగర్‌లోని వాలీబాల్‌ క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  

త్వరలో అకాడమీ ఏర్పాటు 
దశాబ్దకాలం దాటిన తర్వాత మళ్లీ మహబూబ్‌నగర్‌లో వాలీబాల్‌ అకాడమీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. అకాడమీ ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇటీవల మంత్రి సంబంధిత డీవైఎస్‌ఓ శ్రీనివాసును ఆదేశించారు. అకాడమీలో ఏర్పాటు చేసే సదుపాయాలు, సౌకర్యాలపై డీవైఎస్‌ఓ ఈనెల 17న రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీకి ప్రతిపాదనలు పంపారు. దీంతో వచ్చేనెలలో వాలీబాల్‌ అకాడమీకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే అవకాశం ఉంది.  

క్రీడాకారులకు మహర్దశ.. 
వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటుతో ఔత్సాహిక క్రీడాకారులకు మహర్దశ కలగనుంది. దాదాపు 40మంది క్రీడాకారులకు అకాడమీలో అవకాశం లభిస్తుంది. ప్రత్యేక ఎంపికలు, ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపే వారికి అకాడమీలో తీసుకుంటారు. ఎంపికైన క్రీడాకారులకు అకాడమీలోనే వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా కోచ్‌లను నియమించి.. ప్రతి రోజు ఉదయం వేళల్లో ప్రత్యేక వ్యాయామం, సాయంత్రం వేళల్లో వాలీబాల్‌ శిక్షణ ఇస్తారు. ఉదయం గ్రౌండ్‌ రన్నింగ్, వెయిట్‌ రన్నింగ్, స్ట్రెచ్చింగ్, బాల్‌ త్రో వంటిపై శిక్షణ అందజేసి, రాష్ట్ర, జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతారు.

క్రీడాకారులకు మెరుగైన శిక్షణ... 
వాలీబాల్‌ అకాడమీ వస్తే ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభిస్తుంది. అకాడమీ ఏర్పాటుతో వాలీబాల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయవచ్చు. క్రీడాకారులకు అన్ని రకాల వసతులు లభిస్తాయి. త్వరలో మహబూబ్‌నగర్‌కు వాలీబాల్‌ అకాడమీ వస్తుండడం సంతోషంగా ఉంది.
–మహ్మద్‌ హనీఫ్, జిల్లా వాలీబాల్‌ సంఘం కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement