ఆట.. బతుకుదెరువుకు బాట! | Volleyball changed the Ippalapalli village | Sakshi
Sakshi News home page

ఆట.. బతుకుదెరువుకు బాట!

Published Tue, Jul 17 2018 2:08 AM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM

Volleyball changed the Ippalapalli village - Sakshi

గ్రామంలో వాలీబాల్‌ ఆడుతున్న క్రీడాకారులు , పోలీస్‌ శిక్షణలో ఇప్పాయిపల్లి యువకులు (ఫైల్‌)

సాక్షి, వికారాబాద్‌/కుల్కచర్ల: ఇది ఒక ఊరి కథ. కథ అంటే కథ కాదు, యథార్థగా«థ. మారుమూల పల్లె యువకుల సక్సెస్‌ స్టోరీ. ఇరవై ఏళ్ల క్రితం మాట. పనీపాటాలేని పన్నెండు మంది యువకులు ఒక చోట చేరారు.. కాలక్షేపం కోసం ఓ ఆట ఆడడం మొదలుపెట్టారు. కాలక్రమేణా మంచి ప్రావీణ్యం సంపాదించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా గుర్తింపు సంపాదించారు. ఆ ఊరు యువకులంతా ఒకరిని చూసి మరొకరు వారి బాటే పట్టారు, ఆ ఆటే వారికి ఆరో ప్రాణమైంది. అదే వారి బతుకుదెరువుకు బాట అయింది. ఆ ఆటను ఆలంభనగా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ఒకరుకాదు, ఇద్దరు కాదు. ఇప్పటివరకు 210 మంది యువకులు పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాలీబాల్‌ ఆట ఆ గ్రామ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఇదీ ఇప్పాయిపల్లి అనే మారుమూల పల్లె యువత సాధించిన ఘనత.  

రికార్డు సృష్టించిన పల్లె... 
వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలంలో మారుమూలన ఉండే ఇప్పాయిపల్లి జనాభా 2,400. ఓటర్లు 1,740. సాగుయోగ్యమైన భూములు తక్కువ. వర్షాధార పంటలే ఆ ఊరిజనానికి జీవనాధారం. రాగులు, జొన్నలు, మొక్కజొన్న పంటలు వేసేవారు. ఆరుగాలం కష్టించినా వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దీంతో అత్యధికులు బతుకుదెరువు కోసం వలసబాట పట్టేవారు. మట్టి పనులు చేయడం కోసం ఇతర ప్రాంతాలకు కూలీలుగా వెళ్లేవారు. ఈ నేపథ్యంలో వాలీబాల్‌ ఆటలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఎక్కడ టోర్నమెంటు జరిగినా ఇప్పాయిపల్లి వాలీబాల్‌ క్రీడాకారులు బహుమతులు గెలవడం ఆనవాయితీ అయింది.

ఈ క్రమంలో ఇద్దరు వాలీబాల్‌ క్రీడాకారులు పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా క్రీడాకారులు అదే బాట పట్టారు. పోలీసు ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా వారికి వరమైంది. జిల్లాలోనే అత్యధికంగా పోలీసు ఉద్యోగాలు సాధించిన గ్రామంగా ఇప్పాయిపల్లి రికార్డు సృష్టించింది. ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు పోలీసు ఉద్యోగంలో కొనసాగుతున్నారు. మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిదుల వద్ద ఈ గ్రామానికి చెందిన పోలీసులే గన్‌మెన్‌లుగా ఉన్నారు.

ఆ విధంగా రాష్ట్రంలోనే ఇప్పాయిపల్లికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం 210 మంది యువకులు పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఒకప్పుడు వలసకూలీలకు నిలయంగా ఉన్న ఇప్పాయిపల్లి ఇప్పుడు ఖాకీవనమైంది. ‘మా పిల్లలు రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణకే కాకుండా ప్రజాప్రతినిధుల వద్ద రక్షణ కోసం గన్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు’అని వారి తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటున్నారు. వాలీబాల్‌ క్రీడ ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వారందరూ కలసి ఇప్పాయిపల్లి వాలీబాల్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి గ్రామం మధ్యలో అర ఎకరం భూమిని కొనుగోలు చేసి పెద్ద గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు. అందులో యువకులకు ప్రతిరోజు శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి దఫా జరుగుతున్న పోలీసు ఉద్యోగాల ఎంపికలో కనీసం 10 మందికి తక్కువ కాకుండా ఈ గ్రామ వాలీబాల్‌ క్రీడాకారులు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. 

వాలీబాల్‌.. జీవనాధారమైంది.. 
ఆటవిడుపు కోసం ఆడిన వాలీబాల్‌ ఆటనే మాకు బతుకుదెరువైంది. వ్యాయామం, కాలక్షేపం కోసం ప్రతిరోజు ఆట ఆడే సీనియర్ల వెంట మేము కూడా వెళ్లి ఆడుతుండేవాళ్లం. ఆటలో ప్రావీణ్యం సంపాదించడంతో స్పోర్ట్స్‌ కోటా కింద చాలామందికి పోలీసులు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి.
– రాంచందర్, బొంరాస్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ 

గ్రామపెద్దలే ఆదర్శం 
మా గ్రామంలో మొదటగా పోలీసు ఉద్యోగాలు సాధించినవారే మాకు ఆదర్శం. వారిని చూసే వాలీబాల్‌ ఆట నేర్చుకున్నాం. వారి స్ఫూర్తితో, సలహాలతోనే పోలీసు ఉద్యోగాలు సంపాదించాం. ఇప్పుడు కూడా వాలీబాల్‌ ఆటకు ప్రాధాన్యతనిస్తున్నాం. 
– నర్సింహులు, కానిస్టేబుల్, వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌

మంత్రుల వద్ద గన్‌మెన్లు మా ఊరు పోలీసులే... 
జిల్లాలో ఏ పోలీస్‌ స్టేషన్‌లో చూసినా మా గ్రామానికి చెందిన పోలీసులు ఒకరో, ఇద్దరో ఉంటారు. రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల వద్ద కూడా గన్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు. పండుగలు వస్తే గ్రామం అంతా పోలీసు ఉద్యోగస్తులతో నిండిపోతుంది. మా గ్రామ పెద్దలే మాకు ఆదర్శం.
– శ్రీనివాస్, కానిస్టేబుల్, దోమ పోలీస్‌ స్టేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement