కైలాసం (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్/వరంగల్ క్రైం/ఖిలావరంగల్: స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై ఏసీబీ మరో కేసు నమోదుచేసింది. జూడో అసోసియేషన్ సెక్రటరీ కైలాసం యాదవ్‌ను అరెస్టు చేసింది. కైలాసం యాదవ్ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ డబ్బులు వసూలు చేసినట్టు ఏసీబీ నిర్ధారించింది. స్పోర్ట్స్ కోటాలో 12 సీట్లు కేటాయించగా.. అందులో నాలుగు సింగిల్ జూడో విభాగంలో ఉన్నట్టు ఏసీబీ తెలిపింది. ఈ నాలుగు సీట్లు వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులకే ఇచ్చారని గుర్తించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారి డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణే అని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
రూ.4 లక్షల డీల్
సింగిల్ జూడో స్పోర్ట్స్ కోటా కింద నాలుగు సీట్లు అలాట్ అయ్యాయి. ఈ విభాగంలో ఉన్న వరంగల్‌కు చెందిన విద్యార్థి తోటా రుద్రేశ్వర్ నుంచి రూ.4 లక్షలను జూడో అసోసియేషన్ సెక్రటరీ కైలాసం యాదవ్ డిమాండ్ చేశాడు. దీంతో రుద్రేశ్వర్ తండ్రి సునీల్ కుమార్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రూ.2 లక్షలు కైలాసం యాదవ్‌కు ఇచ్చామని, మరో రూ.2 లక్షల కోసం ఒత్తిడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ.. వరంగల్‌లోని కైలాసం యాదవ్ నివాసంతో పాటు స్పోర్ట్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈనేపథ్యంలో జూడో అసోసియేషన్ కార్యదర్శి కైలాసం యాదవ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
దైర్యంగా ఫిర్యాదు చేయండి: ఏసీబీ
క్రీడా కోటాలో మెడికల్ సీట్లకు సంబంధించి బాధితులు దైర్యంగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్‌చేసి ఫిర్యాదు చేయాలని, ఈ వ్యవహారానికి సంబంధించి నెలరోజులపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 7382629283 నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment