గ్రేటర్‌ ఆఫీసుల్లోనూ ఓటరు కార్డులు | Voter Id Cards In All GHMC Circle Offices | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ ఆఫీసుల్లోనూ ఓటరు కార్డులు

Published Sat, Apr 14 2018 9:25 AM | Last Updated on Sat, Apr 14 2018 9:25 AM

Voter Id Cards In All GHMC Circle Offices - Sakshi

ప్రస్తుతం మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా మాత్రమే జారీ అవుతున్న ఓటరు గుర్తింపు కార్డులు(ఎపిక్‌) ఇకపై జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ ఆఫీసుల్లోనూ ఇవ్వనున్నారు. అధిక రుసుం వసూళ్లు, తప్పుడు వ్యక్తులకు కార్డులు జారీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోని ఈఆర్‌ఓల పరిధిలోనే ఎపిక్‌ కార్డుల్ని జారీ చేయాలని భావిస్తున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు కొత్త ఓటర్ల నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. దాంతోపాటు పాత ఓటర్లు సైతం ఓటరు గుర్తింపుకార్డులు పొందేందుకు వీలుగా ఈఆర్‌ఓల పరిధిలో వాటి జారీ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. కలర్‌ ఎపిక్‌ కార్డుకు రూ.25, బ్లాక్‌ అండ్‌ వైట్‌కైతే రూ.10 తీసుకోవాలని భావిస్తున్నారు. వీటిపై తుది నిర్ణయంతీసుకోవాల్సి ఉంది.

సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా మాత్రమే జారీ అవుతున్న ఓటరు గుర్తింపు కార్డులు(ఎపిక్‌) ఇకపై జీహెచ్‌ఎంసీ సర్కిళ్లలోని ఎన్నికల నమోదు అధికారుల (ఈఆర్‌ఓ)కార్యాలయాల్లోనూ జారీ కానున్నాయి. ఓటర్లజాబితాలో ఓటర్లుగా నమోదు..తనిఖీలు చేసి అనర్హులను జాబితానుంచి తొలగించడం.. చిరునామా మార్పులు తదితర అధికారాలు  ఈఆర్‌ఓలకు ఉన్నప్పటికీ, ఓటరు కార్డుల్ని మాత్రం వారు జారీ చేయడం లేరు. జీహెచ్‌ఎంసీ పౌరసేవాకేంద్రాల్లో(సీఎస్సీ) సైతం వీటి జారీ లేదు. నిర్ణీత రుసుముతో మీసేవ, ఈసేవ కేంద్రాల్లోనే జారీ చేస్తున్నారు. తగిన గుర్తింపు, ఆధారాల వంటివి చూపితే వాటిని జారీ చేయాల్సి ఉన్నప్పటికీ, అవేవీ పట్టించుకోకుండా జారీ చేస్తున్నారు. ఫీజులు సైతం అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. పీవీసీ కలర్‌ ఓటరు ఐడీ కార్డుకు రూ.25లుగా ఫీజు నిర్ణయించినప్పటికీ, చాలా మీసేవా కేంద్రాల్లో రూ.50 నుంచి రూ.60 వసూలు చేస్తున్నారు. ఈసేవా కేంద్రాల్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ లామినేటెడ్‌ ఓటరు గుర్తింపుకార్డుకు కేవలం రూ.10 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. వివిధ అవసరాల కోసం ప్రజలు ఓటరు ఐడీ కార్డుల్ని ప్రూఫ్‌గా వినియోగిస్తున్నారు.

దీంతో మీసేవ, ఈసేవ కేంద్రాల్లో అందినకాడికి దండుకుంటున్నారు. మరోవైపు సరైన ఆధారాలు, గుర్తింపు లేకుండానే ఎవరికి పడితే వారికి వాటిని జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల సదుపాయార్థం జీహెచ్‌ఎంసీలోని ఈఆర్‌ఓల పరిధిలో ఎపిక్‌ కార్డుల్ని జారీ చేయాలని భావిస్తున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు కొత్త ఓటర్ల నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. దాంతోపాటు పాత ఓటర్లు సైతం ఓటరు గుర్తింపుకార్డులు పొందేందుకు వీలుగా ఈఆర్‌ఓల పరిధిలో వాటి జారీ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. అందుకవసరమైన కంప్యూటర్లు, పీవీసీ ల్యామినేటెడ్‌ షీట్‌ తదితరమైనవి సమకూర్చుకోవడంతోపాటు వీటి జారీకి అవసరమైన సిబ్బందిని నియమించనున్నారు. కలర్‌ ఎపిక్‌ కార్డుకు రూ.25, బ్లాక్‌ అండ్‌ వైట్‌కైతే రూ.10కి జారీ చేసే యోచనలో ఉన్నారు. వీటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తీరా ఎన్నికలు  ముంచుకొచ్చాక ప్రజలు వీటి కోసం ఎగబడకుండా ఉండేందుకు ఏడాదిపొడవునా అవసరమైన వారికి వీటిని జారీ చేయాలని భావిస్తున్నారు. తద్వారా ఈ కార్డులకోసం ప్రజలు ఎక్కువ మొత్తం చెల్లించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎవరి పేరైనా జాబితాలో లేనట్లయితే తెలుస్తుంది కనుక, తిరిగి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో గత జనవరి వరకు దాదాపు 38 లక్షల మంది ఓటర్లున్నారు. అయితే వీరిలో ఎంతమంది ఎపిక్‌ కార్డులు తీసుకున్నారో, ఎంతమంది తీసుకోలేదో లెక్కల్లేవు. ఓటరు జాబితాలో పేర్లున్నవారందరూ ఎపిక్‌ కార్డులు తీసుకోవడం లేదు. ఏదైనా అవసరానికి గుర్తింపు ధ్రువీకరణ కోసమే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఎన్నికల సమయాల్లో ఆన్‌లైన్‌ ద్వారా తమ పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలుసుకుంటున్నవారు కొందరైతే,  రాజకీయపార్టీల ఏజెంట్లు సరఫరా చేసే ఓటరుస్లిప్‌ల ఆధారంగానే తమ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తున్నవారు అధిక సంఖ్యలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement