voter id cards
-
గంభీర్‌పై పోలీసులకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల బరిలోకి నిలిచిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వివాదంలో చిక్కుకున్నారు. గంభీర్ రెండు ఓటర్ కార్డులు కలిగివున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమ్ అభ్యర్థిని అటిషి మార్లెనా ట్విటర్లో ద్వారా తెలిపారు. ఢిల్లీలోని రెండు నియోజకవర్గాల్లో గంభీర్‌కు ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. కారోల్ బాగ్, రాజిందర్ నగర్లో ఓటు ఉన్నట్టు ట్వీట్ చేశారు. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 125ఏ ప్రకారం ఇది నేరమని, దీనికి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించొచ్చని తెలిపారు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గంభీర్ పోటీ చేస్తున్నారు. (చదవండి: గంభీరే అధిక సంపన్నుడు) కాగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పోటీ పడటం కంటే ప్రధాని నరేంద్ర మోదీ హామీలను అమలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని గౌతమ్ గంభీర్ అన్నారు. ఆప్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రత్యేక రాష్ట్ర హోదా అంశాన్ని కేజ్రీవాల్ తెర మీదకు తెచ్చారని ఆయన ఆరోపించారు. మోదీ, అమిత్ షా ఓడించాలన్న ఉద్దేశం తప్పా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు మరో ఆలోచన లేదని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు తమకు పోటీ కానేకాదని అన్నారు. తనను గెలిపిస్తే తూర్పు ఢిల్లీ నియోజకవర్గాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతానని హామీయిచ్చారు. దేశ రాజధాని ఎలా ఉండాలో అలా తయారు చేస్తానని చెప్పారు. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం అతి పెద్ద సమస్య అని తెలిపారు. -
11 రకాల గుర్తింపు కార్డులు
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ఓటర్ కార్డు లేనివారు ఎన్నికల సంఘం నిర్ణయించిన 11 రకాల గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు. కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన జరిగే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 35,78,458 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపా రు. ఓటర్ కార్డు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటును వినియోగించుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫొటో కూడిన ఓటర్ స్లిప్ గుర్తింపు కార్డు కిందకు రాదని, అది కేవలం పోలింగ్ కేంద్రాల్లో ఓటు నంబర్ తెలుసుకునేందుకే మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారిలో 3,43,619 మం దికి ఓటర్ కార్డులను పంపిణీ చేశామన్నారు. మరో 80 వేల ఓటరు కార్డులు సోమవారం నాటికి జిల్లాకు రానున్నాయన్నారు. వాటిని మం గళ, బుధవారాల్లో పంపి ణీ చేస్తామని వివరిం చారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. గిరిజన ప్రాంతాలైన అరుకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. పోలింగ్ సమయం ముగిసేప్పటికి ఎంత మంది లైన్లో ఉంటారో వారందరికీ స్లిప్స్ ఇచ్చి పోలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తామని, తదుపరి వచ్చిన వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. గుర్తులతో ఉన్న స్లిప్‌లు పంపిణీచేయరాదు ప్రభుత్వం ఫొటోతో కూడిన ఓటర స్లిప్‌లను బీపీఎల్ ద్వారా పంపిణీ జరుగుతోంది. అయితే పార్టీలు సొంతంగా పంపిణీ చేయాలని భావిస్తే పార్టీ గుర్తులు లేని స్లిప్పులను మాత్రమే అందించాలన్నారు. అలా కాకుండా గుర్తులతో ఉన్న వాటిని ఎక్కడైనా పంపిణీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాల గుర్తింపు:ఎస్పీ బాబూజీ జిల్లా ఎస్పీ బాబూజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 2,207 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వాటిలో 256 సమస్యాత్మక, 83 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. అరుకు, పాడేరు నియోజకవర్గాల్లో 469 పోలింగ్ కేంద్రాల్లో ఎల్.డబ్ల్యూ.ఈ ప్రభావిత కేంద్రాలుగా గుర్తించినట్టు వివరించారు. ఆంధ్రా, ఒడిశా పోలీసుల సహకారంతో ఈ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రేహౌండ్, సెంట్ర ల్ పారా మిలటరీ, స్టేట్ ప్రత్యేక దళాల సహకారంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 19 కేంద్రాలకు హెలికాఫ్టర్లలో సిబ్బంది తరలింపు గిరిజన ప్రాంతాలతోపాటు రోడ్డు మార్గంలోని 19 పోలింగ్ కేంద్రాలకు హెలికాఫ్టర్ ద్వారా సిబ్బందిని, పోలింగ్ సామగ్రిన్ని తరలించనున్నామని ఎస్పీ తెలిపారు. ఎన్నికల్లో తొలిసారిగా డ్రోన్లను వినియోగించి పటిష్టమైన నిఘా పెడుతున్నామన్నారు. శరవేగంగా ఓటర్ కార్డు, స్లిప్స్ పంపిణీ ఎన్నికల మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఓటర్లకు అవసరమైన ఓటర్ కార్డులు, ఓటర్ స్లిప్స్‌ను అధికారులు శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,71,520 నూతన కార్డు జారీ చేయగా.. ఇప్పటి వరకు 3,43,619 కార్డులను పంపిణీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 35,78,458 ఓటర్ స్లిప్పులను జారీ చేయగా ఇప్పటి వరకు 26,94,821 స్లిప్పులు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 8,286 మంది బ్లైండ్ ఓటర్లకు బ్రైయిలీ స్లిప్స్ జారీ చేయగా ఇప్పటి వరకు 6,563 పంపిణీ చేశారు. కొత్తగా ఆరు పోలింగ్ కేంద్రాలు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4052 పోలింగ్ కేంద్రాలు ఉండగ వాటికి అదనంగా మరో 6 కేంద్రాలకు ఎన్నికల కమిషన్ అనుమతి జారీ చేసింది. దీనితో జిల్లా వ్యాప్తంగా మొత్తం 4058 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక పోలింగ్ కేంద్రంలో 1600 ఓటర్లు దాటి ఉన్న 39 పోలింగ్ కేంద్రాలను విభజించాలని ఎన్నికల కమిషన్‌ను కోరగా.. అందులో కేవలం 6 కేంద్రాలకు కమిషన్ అనుమతి జారీ చేసింది. గాజువాక నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం నంబరు 54, 157ను, భీమిలి నియోజకవర్గంలో 224, 255, 289, 311 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ గుర్తుంపు కార్డులతో ఓటు వేయవచ్చు ♦ ఆధార్ కార్డు ♦ పాస్‌పోర్ట్ ♦ డ్రైవింగ్ లైసెన్స్ ♦ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు(ఫొటోతో కూడిన సర్వీస్ గుర్తింపు కార్డు) ♦ ఫొటోతో కూడిన బ్యాంకు/పోస్టాఫీసు పాస్‌బుక్ ♦ పాన్ కార్డు ♦ ఎన్ఆర్సీ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డులు ♦ ఉపాధి హామీ జాబ్‌కార్డు ♦ కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్ ఇన్యూరెన్స్ స్మార్ట్ కార్డు ♦ ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్ ♦ ఎంపీ, ఎమ్మెల్యేలకు జారీ చేయబడిన అఫిషీయల్ ఐడీ కార్డు అదనంగా వీవీప్యాట్లు కావాలి: కలెక్టర్ ఈవీఎంలకు సంబంధించి అదనంగా వీవీ ప్యాట్లు అవసరం ఉందని, వాటిని అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జిల్లా ఎన్నికల అధికారి కె.భాస్కర్ కోరారు. ఆదివారం సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పించామన్నారు. ఈ సమావేశంలో నగర్ పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, ఎస్పీ బాబూజీ పాల్గొన్నారు. శాంతి, భద్రతలకు పటిష్ట ఏర్పాట్లు పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఎన్నికల నేపథ్యంలో శాంతి, భద్రతలు పటిష్టంగా అమలు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విశాఖ పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. సిటీ పరిధిలో 333 కేసులకు సంబంధించి 3,393 మందిని బైండోవర్ చేశామని, ఎంసీసీ అతిక్రమించినందుకు 64 కేసులను బుక్ చేశామన్నారు. 819 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మొత్తం 5 వేల 922 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. -
ప్రకాశ్ రాజ్‌పై ప్రజావ్యాజ్యం వేస్తాం
శివాజీనగర : బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ కర్ణాటకతో పాటు మూడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో పేరు ఉండటంతో హైకోర్టులో వ్యాజ్యం వేయనున్నట్లు శాంతినగర నివాసి కే.గిరీశ్ కుమార్ నాయుడు తెలిపారు. ఆదివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో మూడు చోట్ల ఓటర్ల జాబితా ఉన్న విషయాన్ని తెలియజేసిన ఆయన, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ శాంతినగర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో తమ పేరును చేర్చారు. మిగిలిన తమిళనాడులో, తెలంగాణ రాష్ట్రంలో సేర్‌లింగమ్ పల్లి శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాను తమ పేరును అలాగే ఉంచుకొన్నారని ఆరోపించారు. రాజ్యాంగ ఎన్నికల నియమాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకేచోటకంటే అధిక విధానసభా నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పేరు ఉంచుకోవటం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతనెల 28న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. హైకోర్టులో ఈ విషయంపై ప్రజావాజ్యం వేస్తామన్నారు. -
ఓటరు కార్డేదీ?
సాక్షి,సిటీబ్యూరో: మరో రెండో రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కానీ కొత్తగా ఓటర్లకు గుర్తింపు కార్డు మాత్రం ఇంకా అందలేదు. దీంతో తమ ఓటు ఉందో లేదో తెలియక.. తమకు ఓటు వేసే అవకాశం వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు మీ–సేవలో ఆరా తీయగా సర్వర్లు పనిచేయడం లేదని, ఎపిక్ నెంబర్ తెలిస్తే ఆన్లైన్లో చూసుకోవాలని సిబ్బంది సమాధానమిస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్యలో ఆయా మీ–సేవా సెంటర్ల వద్ద కాపు కాస్తున్న బోక్రర్లు సిబ్బందితో కుమ్మకై కార్డుకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. మీ–సేవలో కార్డుకు అధిక డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ‘కార్డుకు రూ.25 మించి చెల్లించవద్దని, కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారికి ఇంటి వద్ద లేదా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల కమిషన్ ఉచితంగా కార్డులు అందచేస్తుంద’ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. అందని సప్లిమెంట్ కార్డులు ఎన్నికలకు ఇంకా రెండు రోజులే ఉంది. ఇంకా దాదాపు హైదరాబాద్ జిల్లాలో రెండోసారి దరఖాస్తు చేసుకున్నవారికి సప్లిమెంట్ ఓటరు కార్డులు అందలేదు. ‘సాక్షి’ ప్రతినిధి పలు ఈఆర్ఓలతో సంప్రదించగా.. ప్రధాన కార్యాలయలం నుంచి కార్డులు అందలేదన్నారు. ఓటుపై పెరిగిన చైతన్యం కల్పిస్తూ అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు సెప్టెంబర్ 25వ తేదీ వరకు కొత్త ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంత మందికి అక్టోబర్ 12వ తేదీ విడుదల చేసిన జాబితాలో ఓట్లు వచ్చాయి. అయితే ఈ లిస్ట్‌లో ఓట్లు వచ్చిన వారికి గుర్తింపు కార్డులు జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఎన్నికల సంఘం నవంబర్ 9 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కానీ ఓటు నమోదైనవారికి మాత్రం కార్డులు ఇవ్వలేదు. పనిచేయని సర్వర్.. ఎన్నికల నిర్వహణ అధికారులు ఎదైనా గుర్తింపు కార్డు తీసుకొచ్చినా ఓటు వేయవచ్చని ప్రచారం చేస్తున్నారు. అయితే ముందు ఓటరు జాబితాలో పేరుందో, లేదో ఎలా తెలుస్తుందనేది నగరవాసి ప్రశ్న. ఇంటర్నెట్లో చూసుకుందామనకున్నా, మీ సేవకు వెళ్లినా సర్వర్ సర్వర్ పనిచేయడం లేదనే సమాధానం వస్తుంది. అసలు ఓటు నమోదు అయిందా లేదా రద్దుఅయిందా తెలియాలి కాదా. -
అరుదైన అవకాశం
మలక్‌పేట బ్రెయిలీ ప్రెస్‌లో దేశంలోనే మొదటిసారిగా అంధుల కోసం ప్రత్యేక ఓటరు కార్డులు ముద్రించారు. అలాగే అంధులు గుర్తించేలా ప్రత్యేక బ్యాలెట్‌ను కూడా ఇక్కడ రూపొందిస్తున్నారు. చాదర్‌ఘాట్: దేశ చరిత్రలోనే మలక్‌పేట బ్రెయిలీ ప్రెస్ ప్రభుత్వ కార్యాలయం గుర్తింపు సాధించిందని బ్రెయిలీ ప్రెస్ ఎడిటర్ జి.వెంకటేశ్వరరావు (అంధుడు) తెలిపారు. బుధవారం మలక్‌పేటలోని కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడాలేని విధంగా అంధుల కోసం ప్రత్యేకంగా ఓటరు ఐడీ కార్డు ముద్రించలేదన్నారు. ప్రస్తుతం మలక్‌పేట బ్రెయిలీ ప్రెస్ ఉద్యోగులు ముద్రించినట్లు చెప్పారు. నగర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల ప్రధానాధికారి రావత్ బ్రెయిలీ ఓటర్ ఐడీ కార్డును అభినందించారన్నారు. అంధులు ఎవరికి ఓటు వేయాలో గుర్తించేలా బ్యాలెట్ పేపర్‌ను తయారు చేస్తున్నట్లు రావత్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు. డిసెంబర్లో జరగనున్న ఎన్నికల్లో బ్రెయిలీ లిపిలో తయారు చేసిన సుమారు 50 వేల ఓటరు ఐడీ కార్డులను ముద్రించినట్లు వెంకటేశ్వరరావు చెప్పారు. -
గ్రేటర్ ఆఫీసుల్లోనూ ఓటరు కార్డులు
ప్రస్తుతం మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా మాత్రమే జారీ అవుతున్న ఓటరు గుర్తింపు కార్డులు(ఎపిక్) ఇకపై జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసుల్లోనూ ఇవ్వనున్నారు. అధిక రుసుం వసూళ్లు, తప్పుడు వ్యక్తులకు కార్డులు జారీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని ఈఆర్ఓల పరిధిలోనే ఎపిక్ కార్డుల్ని జారీ చేయాలని భావిస్తున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు కొత్త ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. దాంతోపాటు పాత ఓటర్లు సైతం ఓటరు గుర్తింపుకార్డులు పొందేందుకు వీలుగా ఈఆర్ఓల పరిధిలో వాటి జారీ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. కలర్ ఎపిక్ కార్డుకు రూ.25, బ్లాక్ అండ్ వైట్‌కైతే రూ.10 తీసుకోవాలని భావిస్తున్నారు. వీటిపై తుది నిర్ణయంతీసుకోవాల్సి ఉంది. సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా మాత్రమే జారీ అవుతున్న ఓటరు గుర్తింపు కార్డులు(ఎపిక్) ఇకపై జీహెచ్ఎంసీ సర్కిళ్లలోని ఎన్నికల నమోదు అధికారుల (ఈఆర్ఓ)కార్యాలయాల్లోనూ జారీ కానున్నాయి. ఓటర్లజాబితాలో ఓటర్లుగా నమోదు..తనిఖీలు చేసి అనర్హులను జాబితానుంచి తొలగించడం.. చిరునామా మార్పులు తదితర అధికారాలు ఈఆర్ఓలకు ఉన్నప్పటికీ, ఓటరు కార్డుల్ని మాత్రం వారు జారీ చేయడం లేరు. జీహెచ్ఎంసీ పౌరసేవాకేంద్రాల్లో(సీఎస్సీ) సైతం వీటి జారీ లేదు. నిర్ణీత రుసుముతో మీసేవ, ఈసేవ కేంద్రాల్లోనే జారీ చేస్తున్నారు. తగిన గుర్తింపు, ఆధారాల వంటివి చూపితే వాటిని జారీ చేయాల్సి ఉన్నప్పటికీ, అవేవీ పట్టించుకోకుండా జారీ చేస్తున్నారు. ఫీజులు సైతం అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. పీవీసీ కలర్ ఓటరు ఐడీ కార్డుకు రూ.25లుగా ఫీజు నిర్ణయించినప్పటికీ, చాలా మీసేవా కేంద్రాల్లో రూ.50 నుంచి రూ.60 వసూలు చేస్తున్నారు. ఈసేవా కేంద్రాల్లో బ్లాక్ అండ్ వైట్ లామినేటెడ్ ఓటరు గుర్తింపుకార్డుకు కేవలం రూ.10 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. వివిధ అవసరాల కోసం ప్రజలు ఓటరు ఐడీ కార్డుల్ని ప్రూఫ్‌గా వినియోగిస్తున్నారు. దీంతో మీసేవ, ఈసేవ కేంద్రాల్లో అందినకాడికి దండుకుంటున్నారు. మరోవైపు సరైన ఆధారాలు, గుర్తింపు లేకుండానే ఎవరికి పడితే వారికి వాటిని జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల సదుపాయార్థం జీహెచ్ఎంసీలోని ఈఆర్ఓల పరిధిలో ఎపిక్ కార్డుల్ని జారీ చేయాలని భావిస్తున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు కొత్త ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. దాంతోపాటు పాత ఓటర్లు సైతం ఓటరు గుర్తింపుకార్డులు పొందేందుకు వీలుగా ఈఆర్ఓల పరిధిలో వాటి జారీ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. అందుకవసరమైన కంప్యూటర్లు, పీవీసీ ల్యామినేటెడ్ షీట్ తదితరమైనవి సమకూర్చుకోవడంతోపాటు వీటి జారీకి అవసరమైన సిబ్బందిని నియమించనున్నారు. కలర్ ఎపిక్ కార్డుకు రూ.25, బ్లాక్ అండ్ వైట్‌కైతే రూ.10కి జారీ చేసే యోచనలో ఉన్నారు. వీటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తీరా ఎన్నికలు ముంచుకొచ్చాక ప్రజలు వీటి కోసం ఎగబడకుండా ఉండేందుకు ఏడాదిపొడవునా అవసరమైన వారికి వీటిని జారీ చేయాలని భావిస్తున్నారు. తద్వారా ఈ కార్డులకోసం ప్రజలు ఎక్కువ మొత్తం చెల్లించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎవరి పేరైనా జాబితాలో లేనట్లయితే తెలుస్తుంది కనుక, తిరిగి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో గత జనవరి వరకు దాదాపు 38 లక్షల మంది ఓటర్లున్నారు. అయితే వీరిలో ఎంతమంది ఎపిక్ కార్డులు తీసుకున్నారో, ఎంతమంది తీసుకోలేదో లెక్కల్లేవు. ఓటరు జాబితాలో పేర్లున్నవారందరూ ఎపిక్ కార్డులు తీసుకోవడం లేదు. ఏదైనా అవసరానికి గుర్తింపు ధ్రువీకరణ కోసమే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఎన్నికల సమయాల్లో ఆన్లైన్ ద్వారా తమ పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకుంటున్నవారు కొందరైతే, రాజకీయపార్టీల ఏజెంట్లు సరఫరా చేసే ఓటరుస్లిప్‌ల ఆధారంగానే తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నవారు అధిక సంఖ్యలో ఉన్నారు. -
అంగట్లో ఐడెంటిటీ..
ఓటరు గుర్తింపు కార్డు కావాలా? ఎవరైనా పర్లేదు.. ఆధారాలతో పనే లేదు.. ఏ దేశమైనా పట్టింపులేదు.. జస్ట్ ఓ రూ.500 ఇస్తే చాలు.. రెండ్రోజుల్లో రెడీ! ఇంకాస్త ఎక్కువిస్తే గంటల్లో ఓటరు కార్డు మీ ముందు ప్రత్యక్షం! ఇక దాన్ని చూపి ఆధార్ కార్డే తీసుకోండి.. డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేసుకోండి.. అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోండి.. ఎంచక్కా పాస్‌పోర్టు కూడా పొందండి!! నిజమేనా.. అని ఆశ్చర్యపోకండి. సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న అతి ప్రమాదకర దందా ఇదీ. నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు ‘సాక్షి’ బృందం రంగంలోకి దిగింది. కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్, ముంబై వరుస పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ అబూసలేం, అతని ప్రియురాలు, సినీనటి మోనికా బేడీ, ప్రధాని సతీమణి జశోదాబెన్ ఫొటోలతో (పై చిత్రాలు) ఓటరు గుర్తింపు కార్డులను కేవలం 48 గంటల్లోనే సంపాదించింది. ఎలాంటి సంఘ విద్రోహశక్తులకైనా ఇట్టే గుర్తింపు కార్డులు ఇచ్చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. శ్రీగిరి విజయ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్ భారీ అక్రమ రాకెట్‌కు అడ్డగా మారుతోంది. ఊరు, పేరు, వయసు, చిరునామా ఇలా ఏ ధ్రువీకరణ కావాలన్నా.. ఎలాంటి క్రాస్ చెక్ లేకుండా కేవలం రూ.500 నుంచి రూ.1,200 తీసుకుని గంటల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చేస్తున్నారు. ఈ కార్డును ఆధారంగా చూపుతూ.. ఆధార్ కార్డు నుంచి పాస్‌పోర్టు దాకా యథేచ్ఛగా పొందుతున్నారు. భాగ్యనగరంలో తలదాచుకుంటున్న విదేశీయులు సైతం సులువుగా ఇలా ఓటరు కార్డులు తీసుకుంటున్నారు. ఆపై ఆధార్, ఇతర పత్రాలతో ‘ఇండియన్ సిటిజన్’గా గుర్తింపు పొందుతున్న వ్యవహారం అంతర్గత భద్రతకు సవాల్‌గా మారుతోంది. మీ–సేవా కేంద్రాలు, వాటి చుట్టూ అల్లుకున్న బ్రోకర్ల సాయంతో ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఎలాంటి ప్రూఫ్‌లు లేకుండా ఓటరు కార్డులు పొందేందుకు ‘సాక్షి’ చేపట్టిన ఆపరేషన్ ఎలా సాగిందో మీరే చదవండి.. ఎంత ఈజీగా ఇచ్చేశారో.. ఇంటర్నెట్లో ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని చార్మినార్ సమీప పరిసరాల్లో తిరిగి ఇష్టం వచ్చిన ఇంటి నంబర్లను రాసుకుని ఛత్తాబజార్, గౌలిపురా, నూర్ఖాన్ బజార్లలోని మీ–సేవ కేంద్రాల్లోకి ‘సాక్షి’బృందం వెళ్లింది. అర్జంట్‌గా ఓటరు గుర్తింపు కార్డులు కావాలని కోరగా, ఒకొక్కరు తొలుత వేలల్లో రేటు చెప్పారు. కాసేపు బేరమాడగా.. రూ.1,200కు ఒక కార్డు జారీ చేసేందుకు ఒప్పుకున్నారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్‌లో భాగంగా ఫాం–6 నింపే క్రమంలో వ్యక్తిగత గుర్తింపు, నివాస ధ్రువీకకరణ పత్రాలతోపాటు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. కానీ అవేవీ పట్టించుకోకుండానే.. మీ–సేవా నిర్వాహకులు వాటన్నింటిని మేనేజ్ చేశారు. 48 గంటల్లోనే ఉగ్రవాది యాసిన్ భత్కల్, అండర్ వరల్డ్ డాన్ అబూసలేం, ఆయన ప్రియురాలు మోనికాబేడీలతోపాటు ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్‌ల ఫొటోలతో కూడిన ఓటరు కార్డులు ‘సాక్షి’బృందం చేతికి వచ్చాయి. ఈ కార్డుల ఆధారంగా అన్ని రకాల కార్డులు సంపాదించే అవకాశాలను సైతం ‘మీ–సేవ’లోనే వివరించటం విశేషం. నగరానికి వివిధ రూపాల్లో వస్తున్న విదేశీయులు కూడా తొలుత ఇలా ఓటరు గుర్తింపు కార్డులు పొంది, దాని ఆధారంగా ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఈజీగా తీసేసుకుంటున్నారు. భత్కల్ కార్డు వచ్చిందిలా.. యాసిన్ భత్కల్ ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు కోసం జీహెచ్ఎంసీ దక్షిణ మండలం కార్యాలయంలోకి వెళ్లి బ్రోకర్‌గా వ్యవహరించే ఓ ఆశా వర్కర్ సిఫారసుతో ‘సాక్షి’ప్రతినిధి దరఖాస్తు చేశారు. అక్కడ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే ఓ ఉద్యోగి కొంత మొత్తాన్ని తీసుకుని వివరాలను అప్లోడ్ చేసింది. మూడ్రోజుల్లో యాసిన్ భత్కల్ ఫొటో, బహుదూర్‌పురా చిరునామాతో మహ్మద్ యాసిన్ పేరుతో ఓటరు గుర్తింపు కార్డును అందజేసింది. యాసిన్ భత్కల్ ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని లుంబినీ, గోకుల్‌చాట్, దిల్సుఖ్నగర్ సహా సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఎన్ఐఏ నిర్ధారించిన సంగతి తెలిసిందే. 1,200తో ‘అబూసలేం’కార్డు.. దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడిగా ఉంటూ 1993లో ముంబై వరుస పేలుళ్లు, ఆపై పలు హత్య కేసులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిరునామాలతో నకిలీ పాస్‌పోర్ట్ పొందిన అబూసలేం, ఆయన ప్రియురాలు మోనికాబేడీల ఫొటోలతో ‘సాక్షి’ప్రతినిధులు ఓటరు కార్డు సంపాదించారు. ఇందుకు ముందుగా వారి ఫొటోలతో ఛత్తాబజార్‌లోని ఓ మీ–సేవ కేంద్రంలోకి వెళ్లి కార్డుకు రూ.1,200 చొప్పున రేటు కుదుర్చుకున్నాం. ఏ ఆధారాలు లేవని చెప్పి ఫాం–6 కోసం వివరాలిచ్చాం. రెండ్రోజుల్లో మహ్మద్ అబ్దుల్ సలీం, మౌనికాదేవి పేర్లతో రెండు ఓటరు కార్డులు ఇచ్చారు. జశోదాబెన్‌కు సైతం.. నగరంలోని నూర్ఖాన్ బజార్‌లోని ఓ మీ–సేవ కేంద్రానికి వెళ్లి ఫాం–6 నింపి, వివరాలేవీ లేవని, ఎలాగైనా మేనేజ్ చేయాలంటూ కొంత మొత్తాన్ని చేతుల్లో పెట్టాం. తొలుత సాధ్యం కాదంటూనే ఆ తర్వాత మీ–సేవ నిర్వాహకుడు బేరమాడి రేటు పెంచాడు. ఆ మొత్తం ఇవ్వగానే మూడ్రోజుల్లో జశోదాబెన్ ఫొటో, నూర్ఖాన్ బజార్ చిరునామాతో జశోదాబాయి పేరిట ఓటరు కార్డును చేతుల్లో పెట్టాడు. ఆ ఒక్క కార్డు ఉంటే చాలు.. ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా ఎన్నో కార్డులు పొందే వీలుంది. అందులోని అడ్రస్ ప్రూఫ్ చూపి.. ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వెపన్ లైసెన్స్ ఇలా ఏది కావాలన్నా సులువుగా పొందొచ్చు. దీన్నే వ్యక్తిగత గుర్తింపు పత్రంగా చూపి ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించవచ్చు. విమాన ప్రయాణాలు చేయటంతోపాటు పోలీసులు నగరంలో చేస్తున్న కార్డన్ సెర్చ్‌ల్లో ఈ కార్డు చూపి బయటపడొచ్చు. దీన్నే కార్డునే వయసు ధ్రువీకరణ పత్రంగా చూపి వివాహాలు రిజిస్టర్ చేసుకోవచ్చు. నగరంలో మైనర్లను మేజర్లుగా చూపుతూ పెద్దఎత్తున ఓటరు గుర్తింపు కార్డులు జారీ అవుతున్నాయి. ఆ కార్డు ఆమె జీవితాన్నే ముంచింది ఈ చిత్రంలో కనిపిస్తున్న మైనర్ అమ్మాయి పేరు రుక్సార్. ప్రస్తుతం ఒమన్ దేశంలో నిత్యం నరకం అనుభవిస్తోంది. పాతబíస్తీలోని వట్టిపల్లిలో నివాసముండే పదహారేళ్ల రుక్సార్‌ను మేజర్‌గా చూపింది పాతబస్తీ కేంద్రంగా పొందిన ఓటరు గుర్తింపు కార్డే. ఆ కార్డు ఆధారంగా 72 ఏళ్ల వృద్ధ షేక్‌తో ఆమె పెళ్లి, పాస్‌పోర్టు జారీ చకచకా జరిగిపోయాయి. తల్లిదండ్రులు నిరుపేదలు కావటంతో మేనత్త గౌసియా వద్ద ఈమె చదువుకునేది. ఓ బ్రోకర్ చెప్పిన మాటలు నమ్మి గౌసియా.. ఒమన్ దేశానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడితో ఆమె తల్లిదండ్రులకు తెలియకుండానే పెళ్లి చేసేసింది. తర్వాత ఒమన్ వెళ్లింది. అక్కడకు వెళ్లాక వృద్ధ షేక్ ఆచూకీ లేదు. అతడి కొడుకులు, మనవళ్లు రుక్సార్పై లైంగిక దాడులకు దిగారు. తిండి, నిద్ర కరువయ్యాయి. ఫోన్ చేసినా అత్త స్పందించలేదు. దీంతో తల్లికి ఫోన్ చేసి తనను నరకం నుంచి విడిపించాలని, లేదంటే విషం తాగి చస్తానని విలపించింది. తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డను అప్పగించాలని తల్లిదండ్రులు విదేశాంగ శాఖను వేడుకుంటున్నారు. అఫ్గాన్ మహిళకు కార్డులు.. బిత్తరపోయిన భర్త విజిట్ వీసాపై భర్త, పిల్లలతో కలసి తొలుత ఢిల్లీకి వచ్చింది అఫ్గాన్‌కు చెందిన నిలోఫర్. 2015 సెప్టెంబర్ 8న భర్తకు చెప్పకుండానే ముగ్గురు పిల్లలు, మరో వ్యక్తితో హైదరాదాబాద్కు వచ్చింది. ఇక్కడ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు సంపాదించింది. ఆమెకు ముందుగా టోలిచౌకీ, తర్వాత రాజేంద్రనగర్ చిరునామాలతో కార్డులు జారీ అయ్యాయి. భార్య, పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చిన భర్త మసూద్ అహ్మద్.. తన భార్య అఫ్గాన్ జాతీయురాలని, ఇక్కడ కార్డులు ఎలా ఇచ్చారంటూ ఆశ్చర్యపోయాడు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీ అలర్ట్!
ఒంగోలు టౌన్: జిల్లాలోని అంగన్వాడీల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కేంద్రాల నిర్వహణకు సంబంధించి ఏరోజుకారోజు వివరాలు అందించడంలో తలమునకలైన అంగన్వాడీలకు బూత్ లెవల్ అధికారుల విధులు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. జిల్లాలోని ఓటర్లకు సంబంధించిన ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు, ఓటర్ ఐడీలను సేకరించి ఫిబ్రవరి 14వ తేదీలోపు అందించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోని అయోమయస్థితిలో పడ్డారు. గతంలో ట్యాబ్‌ల ద్వారా ఓటర్ల వివరాలను నమోదు చేశారు. తాజాగా ట్యాబ్‌ల స్థానంలో పెద్ద బుక్లెట్లు రావడం, ఓటర్ల వివరాలను అందులో సమగ్రంగా రాయాల్సి ఉండటంతో అంగన్వాడీలకు ఎక్కువ సమయం పడుతోంది. ఫొటో పెట్టకుంటే మెమో.. అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరచేందుకు ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు మహిళా శిశుసంక్షేమశాఖ స్మార్ట్ ఫోన్లను అందించింది. కామన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ (సీఎస్ఏ) కింద జిల్లాలోని 4244 అంగన్వాడీ కేంద్రాలకు చెందిన కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కేంద్రాల నిర్వహణను జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ మొదలుకొని ఆ శాఖ కమిషనర్ వరకు భూతద్దంలో చూస్తోంది. ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు తలుపులు ఎన్ని గంటలకు తెరుస్తున్నారు, అంగన్వాడీలు ఎన్ని గంటలకు హాజరవుతున్నారు, ఎంతమంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు హాజరవుతున్నారు, వారికి మధ్యాహ్న సమయంలో నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తున్నారా.. లేదా..? అని అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో లోతుగా పరిశీలన చేస్తున్నారు. కామన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత అంగన్వాడీలు ఠంఛనుగా కేంద్రాలకు చేరుకొని విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, కేంద్రాల పరిధిలోని చిన్నారులు భోజ నం చేసే ఫొటోను తీసి ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఒక్కరోజు భోజనం చేసే ఫొటోను పంపించకుంటే మరుసటిరోజు సంబంధిత అంగన్వాడీ కార్యకర్తకు మెమో జారీ చేస్తున్నారు. బీఎల్ఓ విధులు నిర్వర్తించే సమయంలో లబ్ధిదారులు భోజనం చే సే ఫొటోలు పంపలేదని తమకు మెమోలు ఇస్తే ఎవరు బాధ్యత తీసుకుంటా రని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. సీడీపీఓలకు షోకాజు టెన్షన్.. జిల్లాలోని సీడీపీఓలకు షోకాజు టెన్షన్ పట్టి పీడిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఏరోజుకారోజు మధ్యాహ్న భోజనం సమయంలో లబ్ధిదారుల ఫొటోలను కార్యకర్తలు పంపించకుంటే సంబంధిత ప్రాజెక్టుల సీడీపీఓలకు షోకాజు నోటీసులు జారీ అవుతున్నాయి. సెక్టార్ సూపర్వైజర్లు కూడా కార్యకర్తలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 21ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 4244 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేళ్లలోపు వయస్సు కలిగిన 81,93 మంది, 19,913 మంది గర్భిణులు, 24,670 మంది బాలింతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరందరికి ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. కేంద్రాల వారీగా ఆ రోజు ఎంతమంది వచ్చారో ఆండ్రాయిల్ సెల్ఫోన్ల ద్వారా మెసేజ్ రూపంలో పంపడంతోపాటు వారు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఫొటో తీసి పంపాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ కార్యకర్తలు వివరాలను పంపించకుంటే సంబంధిత సీడీపీఓలకు షోకాజు నోటీసులు జారీ అవుతున్నాయి. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు ఎంత అలర్ట్‌గా ఉన్నారో అంతకంటే ఎక్కువ అలర్ట్‌గా సీడీపీఓలు, సూపర్వైజర్లు ఉండటం గమనార్హం. -
నడిరోడ్డుపై ఓటర్ కార్డులు
విజయవాడలో కలకలం స్వాధీనం చేసుకున్న అధికారులు విజయవాడ (వన్‌టౌన్): ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ఆయుధం.. ఓటు హక్కు. ఈ హక్కును వినియోగించుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. ఎంతో విలువైన ఈ గుర్తింపు కార్డులు నడిరోడ్డుపై దర్శనమిచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది కార్డులు రోడ్డుపై పని ఉన్నాయి. విజయవాడలో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కొత్తపేట దూది ఫ్యాక్టరీ రోడ్డులోని చేపల మార్కెట్‌కు సమీపంలో ఓటర్ గుర్తింపు కార్డులు రెండు గోనె సంచుల్లో ఉండటాన్ని ఆదివారం స్థానికులకు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలు సామినేని ఉదయభాను, పి.గౌతంరెడ్డి వచ్చి పరిశీలించారు. అక్కడ వేలాది ఓటర్ గుర్తింపు కార్డులు పడేయడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇవి అధికార టీడీపీ నేతలు గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకునేందుకు ఉపయోగించిన కార్డులేనని వారు ఆరోపించారు. దీనిపై న్యాయవిచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గానికి చెందినవే: ఈ ఓటర్ గుర్తింపు కార్డుల్లో 90 శాతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందినవే ఉన్నాయి. ముఖ్యంగా అజిత్‌సింగ్‌నగర్, అయోధ్యనగర్, సూర్యారావుపేట ప్రాంతాలకు చెందిన కార్డులు ఉన్నాయి. ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్సైట్లో పరిశీలించగా వీటిలోని పలు గుర్తింపు కార్డులు వాడుకలోనే ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కార్డులను పరిశీలించారు. ఇక్కడ ఐదు వేలకు పైగా కార్డులు ఉన్నాయని చెప్పారు. వాటిని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. కార్పొరేషన్లో ఎన్నికల విభాగం అధికారులకు అప్పగించారు. ఓటర్ గుర్తింపు కార్డులను దొంగ ఓట్ల కోసం సేకరించి, పని ముగిశాక రోడ్డుపై పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లను సృష్టించి, గత ఎన్నికల్లో అసలు ఓటర్లను బూత్‌కు రాకుండా చేసేందుకు కుట్ర పన్నారని పేర్కొంటున్నారు. ఎన్నికల విభాగం అధికారుల సహకారంతోనే ఈ గుర్తింపు కార్డులను సేకరించి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
బెజవాడ సెంటర్లో బస్తాల్లో ఓటరు కార్డులు
-
కిరణ్ బేడీకి రెండు ఓటరు కార్డులు
ఈసీ విచారణ ప్రారంభం న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు ఐడీ కార్డులున్న విషయం వెలుగుచూసింది. ఎన్నికల కమిషన్(ఈసీ) రికార్డుల ప్రకారం ఉదయ్‌పార్క్, తల్కతోరా లేన్ చిరునామాలతో ఆమెకు రెండు ఓటరు కార్డులు(టీజెడ్‌డీ1656909, ఎస్‌జెఈ0047969) ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇవి ఎలా జారీ అయ్యాయో తేల్చేందుకు విచారణ ప్రారంభించామని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. మొదటి కార్డు(తల్కతోరా)ను తొలగించాలని ఆమె దరఖాస్తు చేశారో లేదో తెలుసుకుంటామంది. నామినేషన్ పత్రాల్లో ఆమె ఉదయ్‌పార్క్ చిరునామాలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయగా మరోపక్క.. తన ప్రత్యర్థి కేజ్రీవాల్ ప్రతికూల వ్యక్తి అని, ఆయన బృందం అత్యంత విషపూరితమైందని బేడీ విమర్శించారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనుండడంతో బీజేపీ తన ముఖ్య నాయకుల్లో కొందరిని బుధవారం ఎన్నికల ప్రచారంలోకి దింపింది. కేంద్ర మంత్రులు సుష్మా, స్మృతి ఇరానీలు ఢిల్లీలో పలు చోట్ల ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ నాలుగు సభలో పాల్గొననున్నారు. కాగా, ప్రత్యర్థి పార్టీ సీనియర్ నేత ఒకరు తమ పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థులపై మీడియాలో దుష్ర్పచారం చేయడానికి కుట్రపన్నారని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. -
ఇల్లు మారితే ఓటు గల్లంతే: భన్వర్‌లాల్
-
ఇల్లు మారితే ఓటు గల్లంతే: భన్వర్‌లాల్
ఓటరు స్లిప్పు లేకపోయినా, ఓటరు ఐడీ కార్డు లేకపోయినా కూడా.. ఓటర్ల జాబితాలో పేరు ఉండి, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 11 రకాల గుర్తింపు కార్డులలో ఏది ఉన్నా కూడా ఓటు వేయనివ్వాలని ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రంలోకి ఎవరు వెళ్లినా.. వారందరితో ఓటు వేయించాలని చెప్పారు. అవసరమైతే అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ నిర్వహిస్తామని, కానీ సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం ప్రాంగణంలోకి చేరుకున్నవారికి మాత్రమే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రాధా సహా పలువురి ఓట్లు గల్లంతు కావడంపై మీడియా ఆయనను ప్రశ్నించగా, చాలా తక్కువచోట్ల మాత్రమే పొరపాట్లు జరిగాయని, మిగిలినచోట్ల ప్రధానంగా ఇళ్లు మారిపోవడం వల్ల మాత్రమే ఓట్లు పోయాయని ఆయన చెప్పారు. ఇళ్లు మారితే నియోజకవర్గాలు కూడా మారిపోతాయని, పక్క పక్క వీధులు కూడా వేర్వేరు నియోజకవర్గాలలోకి రావచ్చని భన్వర్‌లాల్ తెలిపారు. తాము గత మూడు సంవత్సరాల నుంచి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలు తనిఖీ చేస్తున్నామని, మూడు లక్షల పేర్లను హైదరాబాద్‌లో తీసేశామని వివరించారు. అందువల్ల ఇళ్లు మారినప్పుడు తప్పనిసరిగా కొత్త చిరునామాలో ఓటు నమోదు చేయించుకుని, పాతది తీయించేయాలని ఆయన సూచించారు. ఓటరు స్లిప్పులు లేనిచోట్ల సీరియల్ నెంబరు చూడటం ఆలస్యం అవ్వడంతో ఓటింగ్ కొంత ఆలస్యంగా జరుగుతోందని, ఈ విషయం తెలిసి తెలుగు అక్షర క్రమంలో జాబితాలు పెట్టామని అన్నారు. వాటిలో ఇంటి నెంబరు లేదా పేరు చెప్పి సీరియల్ నెంబరు చూసి ఓటు వేసుకోవచ్చని భన్వర్‌లాల్ తెలిపారు. కొన్నిచోట్ల ఓటరు గుర్తింపుకార్డు లేనివారిని ఓట్లు వేయడానికి అంగీకరించట్లేదని తెలిసిందని, ఎన్నికల కమిషన్ తెలిపిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా వాటిని ఆమోదించాలని ఆయన ఎన్నికల అధికారులను ఆదేశించారు. పాన్ కార్డు, పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పాస్ పోర్టు, ఉపాధి హామీ జాబ్ కార్డు.. ఇలా ఏవి ఉన్నా పర్వాలేదని, స్లిప్పు లేకపోయినా, ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా, పేరు జాబితాలో ఉంటే గుర్తింపు చూసి ఓటేయచ్చని అన్నారు. దేవుడి దయ వల్ల వాతావరణం బాగుందని, బుధవారం ఎండ కూడా ఎక్కువగా లేదని, అందువల్ల ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. అన్ని చోట్ల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అంతా ప్రశాంతంగానే ఉందని, ఉదయం 9 గంటల వరకు సగటున 14 శాతం ఓటింగ్ నమోదైందని చెప్పారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ లో 17 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 11 శాతం పోలింగ్ నమోదయ్యిందన్నారు. -
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం