ఓటరు గుర్తింపు కార్డు కావాలా? ఎవరైనా పర్లేదు.. ఆధారాలతో పనే లేదు.. ఏ దేశమైనా పట్టింపులేదు.. జస్ట్ ఓ రూ.500 ఇస్తే చాలు.. రెండ్రోజుల్లో రెడీ! ఇంకాస్త ఎక్కువిస్తే గంటల్లో ఓటరు కార్డు మీ ముందు ప్రత్యక్షం! ఇక దాన్ని చూపి ఆధార్ కార్డే తీసుకోండి.. డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేసుకోండి.. అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోండి.. ఎంచక్కా పాస్‌పోర్టు కూడా పొందండి!!
నిజమేనా.. అని ఆశ్చర్యపోకండి. సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న అతి ప్రమాదకర దందా ఇదీ. నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు ‘సాక్షి’ బృందం రంగంలోకి దిగింది. కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్, ముంబై వరుస పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ అబూసలేం, అతని ప్రియురాలు, సినీనటి మోనికా బేడీ, ప్రధాని సతీమణి జశోదాబెన్ ఫొటోలతో (పై చిత్రాలు) ఓటరు గుర్తింపు కార్డులను కేవలం 48 గంటల్లోనే సంపాదించింది. ఎలాంటి సంఘ విద్రోహశక్తులకైనా ఇట్టే గుర్తింపు కార్డులు ఇచ్చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.
శ్రీగిరి విజయ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్ భారీ అక్రమ రాకెట్‌కు అడ్డగా మారుతోంది. ఊరు, పేరు, వయసు, చిరునామా ఇలా ఏ ధ్రువీకరణ కావాలన్నా.. ఎలాంటి క్రాస్ చెక్ లేకుండా కేవలం రూ.500 నుంచి రూ.1,200 తీసుకుని గంటల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చేస్తున్నారు. ఈ కార్డును ఆధారంగా చూపుతూ.. ఆధార్ కార్డు నుంచి పాస్‌పోర్టు దాకా యథేచ్ఛగా పొందుతున్నారు. భాగ్యనగరంలో తలదాచుకుంటున్న విదేశీయులు సైతం సులువుగా ఇలా ఓటరు కార్డులు తీసుకుంటున్నారు. ఆపై ఆధార్, ఇతర పత్రాలతో ‘ఇండియన్ సిటిజన్’గా గుర్తింపు పొందుతున్న వ్యవహారం అంతర్గత భద్రతకు సవాల్‌గా మారుతోంది. మీ–సేవా కేంద్రాలు, వాటి చుట్టూ అల్లుకున్న బ్రోకర్ల సాయంతో ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఎలాంటి ప్రూఫ్‌లు లేకుండా ఓటరు కార్డులు పొందేందుకు ‘సాక్షి’ చేపట్టిన ఆపరేషన్ ఎలా సాగిందో మీరే చదవండి..
ఎంత ఈజీగా ఇచ్చేశారో..
ఇంటర్నెట్‌లో ఫొటోలు డౌన్‌లోడ్ చేసుకుని చార్మినార్ సమీప పరిసరాల్లో తిరిగి ఇష్టం వచ్చిన ఇంటి నంబర్లను రాసుకుని ఛత్తాబజార్, గౌలిపురా, నూర్‌ఖాన్ బజార్‌లలోని మీ–సేవ కేంద్రాల్లోకి ‘సాక్షి’బృందం వెళ్లింది. అర్జంట్‌గా ఓటరు గుర్తింపు కార్డులు కావాలని కోరగా, ఒకొక్కరు తొలుత వేలల్లో రేటు చెప్పారు. కాసేపు బేరమాడగా.. రూ.1,200కు ఒక కార్డు జారీ చేసేందుకు ఒప్పుకున్నారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్‌లో భాగంగా ఫాం–6 నింపే క్రమంలో వ్యక్తిగత గుర్తింపు, నివాస ధ్రువీకకరణ పత్రాలతోపాటు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. కానీ అవేవీ పట్టించుకోకుండానే.. మీ–సేవా నిర్వాహకులు వాటన్నింటిని మేనేజ్ చేశారు. 48 గంటల్లోనే ఉగ్రవాది యాసిన్ భత్కల్, అండర్ వరల్డ్ డాన్ అబూసలేం, ఆయన ప్రియురాలు మోనికాబేడీలతోపాటు ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్‌ల ఫొటోలతో కూడిన ఓటరు కార్డులు ‘సాక్షి’బృందం చేతికి వచ్చాయి. ఈ కార్డుల ఆధారంగా అన్ని రకాల కార్డులు సంపాదించే అవకాశాలను సైతం ‘మీ–సేవ’లోనే వివరించటం విశేషం. నగరానికి వివిధ రూపాల్లో వస్తున్న విదేశీయులు కూడా తొలుత ఇలా ఓటరు గుర్తింపు కార్డులు పొంది, దాని ఆధారంగా ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఈజీగా తీసేసుకుంటున్నారు.
భత్కల్ కార్డు వచ్చిందిలా..
యాసిన్ భత్కల్ ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు కోసం జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం కార్యాలయంలోకి వెళ్లి బ్రోకర్‌గా వ్యవహరించే ఓ ఆశా వర్కర్ సిఫారసుతో ‘సాక్షి’ప్రతినిధి దరఖాస్తు చేశారు. అక్కడ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే ఓ ఉద్యోగి కొంత మొత్తాన్ని తీసుకుని వివరాలను అప్‌లోడ్ చేసింది. మూడ్రోజుల్లో యాసిన్ భత్కల్ ఫొటో, బహుదూర్‌పురా చిరునామాతో మహ్మద్ యాసిన్ పేరుతో ఓటరు గుర్తింపు కార్డును అందజేసింది. యాసిన్ భత్కల్ ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని లుంబినీ, గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్ సహా సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఎన్‌ఐఏ నిర్ధారించిన సంగతి తెలిసిందే.
1,200తో ‘అబూసలేం’కార్డు..
దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడిగా ఉంటూ 1993లో ముంబై వరుస పేలుళ్లు, ఆపై పలు హత్య కేసులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిరునామాలతో నకిలీ పాస్‌పోర్ట్ పొందిన అబూసలేం, ఆయన ప్రియురాలు మోనికాబేడీల ఫొటోలతో ‘సాక్షి’ప్రతినిధులు ఓటరు కార్డు సంపాదించారు. ఇందుకు ముందుగా వారి ఫొటోలతో ఛత్తాబజార్‌లోని ఓ మీ–సేవ కేంద్రంలోకి వెళ్లి కార్డుకు రూ.1,200 చొప్పున రేటు కుదుర్చుకున్నాం. ఏ ఆధారాలు లేవని చెప్పి ఫాం–6 కోసం వివరాలిచ్చాం. రెండ్రోజుల్లో మహ్మద్ అబ్దుల్ సలీం, మౌనికాదేవి పేర్లతో రెండు ఓటరు కార్డులు ఇచ్చారు.
జశోదాబెన్‌కు సైతం..
నగరంలోని నూర్‌ఖాన్ బజార్‌లోని ఓ మీ–సేవ కేంద్రానికి వెళ్లి ఫాం–6 నింపి, వివరాలేవీ లేవని, ఎలాగైనా మేనేజ్ చేయాలంటూ కొంత మొత్తాన్ని చేతుల్లో పెట్టాం. తొలుత సాధ్యం కాదంటూనే ఆ తర్వాత మీ–సేవ నిర్వాహకుడు బేరమాడి రేటు పెంచాడు. ఆ మొత్తం ఇవ్వగానే మూడ్రోజుల్లో జశోదాబెన్ ఫొటో, నూర్‌ఖాన్ బజార్ చిరునామాతో జశోదాబాయి పేరిట ఓటరు కార్డును చేతుల్లో పెట్టాడు.
ఆ ఒక్క కార్డు ఉంటే చాలు..
ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా ఎన్నో కార్డులు పొందే వీలుంది. అందులోని అడ్రస్ ప్రూఫ్ చూపి.. ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వెపన్ లైసెన్స్ ఇలా ఏది కావాలన్నా సులువుగా పొందొచ్చు. దీన్నే వ్యక్తిగత గుర్తింపు పత్రంగా చూపి ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించవచ్చు. విమాన ప్రయాణాలు చేయటంతోపాటు పోలీసులు నగరంలో చేస్తున్న కార్డన్ సెర్చ్‌ల్లో ఈ కార్డు చూపి బయటపడొచ్చు. దీన్నే కార్డునే వయసు ధ్రువీకరణ పత్రంగా చూపి వివాహాలు రిజిస్టర్ చేసుకోవచ్చు. నగరంలో మైనర్లను మేజర్లుగా చూపుతూ పెద్దఎత్తున ఓటరు గుర్తింపు కార్డులు జారీ అవుతున్నాయి.
ఆ కార్డు ఆమె జీవితాన్నే ముంచింది
ఈ చిత్రంలో కనిపిస్తున్న మైనర్ అమ్మాయి పేరు రుక్సార్. ప్రస్తుతం ఒమన్ దేశంలో నిత్యం నరకం అనుభవిస్తోంది. పాతబíస్తీలోని వట్టిపల్లిలో నివాసముండే పదహారేళ్ల రుక్సార్‌ను మేజర్‌గా చూపింది పాతబస్తీ కేంద్రంగా పొందిన ఓటరు గుర్తింపు కార్డే. ఆ కార్డు ఆధారంగా 72 ఏళ్ల వృద్ధ షేక్‌తో ఆమె పెళ్లి, పాస్‌పోర్టు జారీ చకచకా జరిగిపోయాయి. తల్లిదండ్రులు నిరుపేదలు కావటంతో మేనత్త గౌసియా వద్ద ఈమె చదువుకునేది. ఓ బ్రోకర్ చెప్పిన మాటలు నమ్మి గౌసియా.. ఒమన్ దేశానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడితో ఆమె తల్లిదండ్రులకు తెలియకుండానే పెళ్లి చేసేసింది. తర్వాత ఒమన్ వెళ్లింది. అక్కడకు వెళ్లాక వృద్ధ షేక్ ఆచూకీ లేదు. అతడి కొడుకులు, మనవళ్లు రుక్సార్‌పై లైంగిక దాడులకు దిగారు. తిండి, నిద్ర కరువయ్యాయి. ఫోన్ చేసినా అత్త స్పందించలేదు. దీంతో తల్లికి ఫోన్ చేసి తనను నరకం నుంచి విడిపించాలని, లేదంటే విషం తాగి చస్తానని విలపించింది. తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డను అప్పగించాలని తల్లిదండ్రులు విదేశాంగ శాఖను వేడుకుంటున్నారు.
అఫ్గాన్ మహిళకు కార్డులు.. బిత్తరపోయిన భర్త
విజిట్ వీసాపై భర్త, పిల్లలతో కలసి తొలుత ఢిల్లీకి వచ్చింది అఫ్గాన్‌కు చెందిన నిలోఫర్. 2015 సెప్టెంబర్ 8న భర్తకు చెప్పకుండానే ముగ్గురు పిల్లలు, మరో వ్యక్తితో హైదరాదాబాద్‌కు వచ్చింది. ఇక్కడ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు సంపాదించింది. ఆమెకు ముందుగా టోలిచౌకీ, తర్వాత రాజేంద్రనగర్ చిరునామాలతో కార్డులు జారీ అయ్యాయి. భార్య, పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చిన భర్త మసూద్ అహ్మద్.. తన భార్య అఫ్గాన్ జాతీయురాలని, ఇక్కడ కార్డులు ఎలా ఇచ్చారంటూ ఆశ్చర్యపోయాడు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment