ఇల్లు మారితే ఓటు గల్లంతే: భన్వర్లాల్
ఓటరు స్లిప్పు లేకపోయినా, ఓటరు ఐడీ కార్డు లేకపోయినా కూడా.. ఓటర్ల జాబితాలో పేరు ఉండి, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 11 రకాల గుర్తింపు కార్డులలో ఏది ఉన్నా కూడా ఓటు వేయనివ్వాలని ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రంలోకి ఎవరు వెళ్లినా.. వారందరితో ఓటు వేయించాలని చెప్పారు. అవసరమైతే అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ నిర్వహిస్తామని, కానీ సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం ప్రాంగణంలోకి చేరుకున్నవారికి మాత్రమే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రాధా సహా పలువురి ఓట్లు గల్లంతు కావడంపై మీడియా ఆయనను ప్రశ్నించగా, చాలా తక్కువచోట్ల మాత్రమే పొరపాట్లు జరిగాయని, మిగిలినచోట్ల ప్రధానంగా ఇళ్లు మారిపోవడం వల్ల మాత్రమే ఓట్లు పోయాయని ఆయన చెప్పారు. ఇళ్లు మారితే నియోజకవర్గాలు కూడా మారిపోతాయని, పక్క పక్క వీధులు కూడా వేర్వేరు నియోజకవర్గాలలోకి రావచ్చని భన్వర్లాల్ తెలిపారు. తాము గత మూడు సంవత్సరాల నుంచి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలు తనిఖీ చేస్తున్నామని, మూడు లక్షల పేర్లను హైదరాబాద్లో తీసేశామని వివరించారు. అందువల్ల ఇళ్లు మారినప్పుడు తప్పనిసరిగా కొత్త చిరునామాలో ఓటు నమోదు చేయించుకుని, పాతది తీయించేయాలని ఆయన సూచించారు.
ఓటరు స్లిప్పులు లేనిచోట్ల సీరియల్ నెంబరు చూడటం ఆలస్యం అవ్వడంతో ఓటింగ్ కొంత ఆలస్యంగా జరుగుతోందని, ఈ విషయం తెలిసి తెలుగు అక్షర క్రమంలో జాబితాలు పెట్టామని అన్నారు. వాటిలో ఇంటి నెంబరు లేదా పేరు చెప్పి సీరియల్ నెంబరు చూసి ఓటు వేసుకోవచ్చని భన్వర్లాల్ తెలిపారు. కొన్నిచోట్ల ఓటరు గుర్తింపుకార్డు లేనివారిని ఓట్లు వేయడానికి అంగీకరించట్లేదని తెలిసిందని, ఎన్నికల కమిషన్ తెలిపిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా వాటిని ఆమోదించాలని ఆయన ఎన్నికల అధికారులను ఆదేశించారు. పాన్ కార్డు, పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పాస్ పోర్టు, ఉపాధి హామీ జాబ్ కార్డు.. ఇలా ఏవి ఉన్నా పర్వాలేదని, స్లిప్పు లేకపోయినా, ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా, పేరు జాబితాలో ఉంటే గుర్తింపు చూసి ఓటేయచ్చని అన్నారు.
దేవుడి దయ వల్ల వాతావరణం బాగుందని, బుధవారం ఎండ కూడా ఎక్కువగా లేదని, అందువల్ల ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. అన్ని చోట్ల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అంతా ప్రశాంతంగానే ఉందని, ఉదయం 9 గంటల వరకు సగటున 14 శాతం ఓటింగ్ నమోదైందని చెప్పారు. అత్యధికంగా మహబూబ్నగర్ లో 17 శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 11 శాతం పోలింగ్ నమోదయ్యిందన్నారు.