ఈవీఎంలతో స్ట్రాంగ్‌రూం వద్దకు చేరిన ఎన్నికల సిబ్బంది
ఆదిలాబాద్‌అర్బన్: శాసనసభ ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థులకు ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన తీర్పు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లో నిక్షిప్తమై ఉంది. శాసనసభ రద్దు నుంచి గత మూడు నెలలుగా కొనసాగుతున్న ముందస్తు ఎన్నికల ఉత్కంఠకు తెర దించేందుకు మరో మూడు రోజులే మిగిలి ఉన్నాయి. కాగా, శుక్రవా రం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరి గింది. జిల్లాలోని 520 పోలింగ్ కేంద్రాల్లో ఉద యం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఓటేసేందుకు సాయంత్రం 5 గంటల వరకు సమయమున్నా.. కొన్ని కేంద్రాల్లో పావుగంట ముందే ముగిసింది.
మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఐదు గంటలలోపు కేంద్రాలకు వచ్చిన ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారు. దీంతో ఆయా కేంద్రాల్లో సాయంత్రం దాదాపు 6 గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 520 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్కో కేంద్రంలో నలుగురు, ఐదుగురు సిబ్బందిని నియమించారు. అన్ని కేంద్రాల వద్ద వివిధ కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులను బందోబస్తుగా నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో పోలింగ్ ఇలా..
జిల్లాలో మొత్తం పురుషులు 1,90,517 మంది ఉండగా, మహిళలు 1,93,557 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 62 మందితో కలిపి మొత్తం 3,84,136 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, వీరిలో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 3,20,380 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,01,139 మంది ఓటర్లు ఉండగా, 1,64,135 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో 81.6 పోలింగ్ శాతం నమోదైంది. బోథ్‌లో 1,82,997 మంది ఓటర్లు ఉండగా, 1,56,245 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఈ నియోజకవర్గంలో 85.38 శాతం పోలింగ్ నమోదైంది. మరో రెండు శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, 2014 జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు కలిపి 71.93 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 83.49 శాతానికి పెరిగింది.
కలెక్టరేట్‌లో పోలింగ్ సరళి పరిశీలన..
జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళిని కలెక్టరేట్ సమావేశ మందిరంలోని కంట్రోల్ రూం నుంచి పరిశీలించారు. జిల్లాలో వెబ్‌కాస్టింగ్ చేపట్టిన 70 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరిగిన ఓటింగ్ తీరును కలెక్టర్ దివ్యదేవరాజన్, జేసీ సంధ్యారాణి, డీఆర్వో నటరాజ్, ఎన్నికల పరిశీలకులు ప్రత్యక్షంగా వీక్షించారు. కాగా, ఆయా పీఎస్‌లలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే సమాచారం అందించి పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా, మరో 200 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా, 110 పోలింగ్ కేంద్రాల్లో ట్యాబ్‌ల ద్వారా, 140 పీఎస్‌లలో వెబ్ రికార్డింగ్ ద్వారా ఓటింగ్ సరళిని నిక్షిప్తం చేశారు.
కౌంటింగ్ కేంద్రాలకు యంత్రాలు..
జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించిన పోలింగ్ సిబ్బంది ప్రక్రియ ముగిసిన వెంటనే ఓటింగ్ యంత్రాలను జిల్లా కేంద్రానికి తరలించారు. వీవీప్యాట్, ఈవీఎంలకు సీల్ వేసి వారికి కేటాయించిన బస్సుల్లో జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్ర పర్చేందుకు తీసుకెళ్లారు. దూర ప్రాంతాలలో ఉన్న పోలింగ్ సిబ్బంది జిల్లా కేంద్రానికి వచ్చేందుకు రాత్రి వరకు సమయం పట్టింది. దీంతో ఆయా సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఆలస్యంగా ఇవ్వాల్సి వచ్చింది. కాగా, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ యంత్రాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు.
అభ్యర్థుల్లో టెన్షన్.. 11న తేలనున్న భవిత
అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో గెలుపోటములపై టెన్షన్ మొదలైంది. పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు తీరిక లేకుండా గడిపిన అభ్యర్థులు ప్రస్తుతం టెన్షన్.. టెన్షన్‌గా.. గడుపుతున్నారు. గత రెండు నెలల నుంచి ప్రతీరోజూ తీరక లేకుండా ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేపట్టిన అభ్యర్థులు వారిచ్చిన తీర్పు కోసం ఊపిరి బిగపట్టుకొని ఎదురుచూస్తున్నారు. కొందరు అభ్యర్థులు మీ పోలింగ్ కేంద్రం పరిధిలో ఏ గుర్తుకు ఎక్కువ ఓట్లు పడ్డాయి.. మీ గ్రామాల్లో ఏ పార్టీపై ప్రజలు ఆసక్తితో ఉన్నారనే విషయం కూడా అడిగి తెలుసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా ఆయా గ్రామాల్లో ఉన్న తన సహచర వ్యక్తులకు ఫోన్ చేసి మీ గ్రామంలో ఓట్లు ఏటువైపు పడ్డాయని మరి అడిగి తెలుసుకుంటూ లెక్కలేసుకుంటున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఈ నెల 11 వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment