రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
సాక్షి, శివ్వంపేట (మెదక్‌జిల్లా): నవంబర్ 1 నుంచి 25 వరకు ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాలను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఆంజనేయశర్మ, ఈఓ శ్రీనివాసులు భన్వర్‌లాల్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న ఆంజనేయశర్మను భన్వర్‌లాల్ అభినందించారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జనవరి 2015 సంవత్సరానికి 18 సంవత్సరాలు నిండే యువతీయువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారి కోసం నవంబర్ 1 నుంచి 25 వరకు గ్రామాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తునట్టు చెప్పారు. ఓటరుజాబితాలో పేర్లు తప్పిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జనవరి 5న ఓటరు జాబితా విడుదల చేస్తామని, 25న గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకుడు శ్రీధర్‌గుప్తా, ప్రధాన అర్చకులు దేవదత్తశర్మ పాల్గొన్నారు.