సాక్షి, జనగామ: ఐసీడీఎస్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీకి గ్రహణం పట్టింది. నాలుగు నెలల క్రితమే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పిన అధికారులు చివరకు ఆగిపోయారు. దీంతో అంగన్‌వాడీ పోస్టుల కోసం జిల్లాలోని నిరుద్యోగ మహిళలు ఎదురు చూస్తున్నారు. 1977లో మాతాశిశు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నెలకొల్పి గర్భిణులు, బాలింతలు, ఆరు ఏళ్లలోపు చిన్నారులకు సేవలందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల ప్రాజెక్టుల పరిధిలో 732 కేంద్రాలున్నాయి.
కేజీ టు పీజీ పథకానికి తొలిమెట్టు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కేజీ టు పీజీ ఉచిత విద్య పథకానికి అంగన్‌వాడీ కేంద్రాలను తొలిమెట్టుగా భావిస్తున్నారు. అర్హత ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు ఉపాధ్యాయ శిక్షణను ఇప్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేజీ టు పీజీ విద్య పథకం విజయవంతం కావాలంటే అంగన్‌వాడీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల ప్రాధాన్యం పెరిగింది.
ఇన్‌చార్జిలతోనే..
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి 2017 నవంబర్ నెలలో సన్నాహాలను ప్రారంభించారు. నాలుగేళ్ల తర్వాత ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, నోటిఫికేషన్ ఇప్పటివరకు జారీ చేయలేదు. జనగామ ప్రాజెక్టు పరిధిలో 16 మంది అంగన్‌వాడీ టీచర్లు, 9 మినీ అంగన్‌వాడీ టీచర్లు, 24 ఆయా పోస్టుల చొప్పున ఖాళీ ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాజెక్టు పరిధిలో 10 అంగన్‌వాడీ టీచర్లు, 7 మినీ అంగన్‌వాడీ టీచర్లు, 14 ఆయా పోస్టులు, కొడకండ్ల ప్రాజెక్టు పరిధిలో 13 అంగన్‌వాడీ టీచర్లు, 9 మినీ టీచర్లు, 21 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ నెలలో ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి వచ్చినప్పటికి వాటి ఊసే లేకుండా పోయింది. ఇన్‌చార్జిలతోనే నెట్టుకు వస్తున్నారు.
ప్రభుత్వానికి నివేదిక పంపాం..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నవంబర్ నెలలో గుర్తించాం. ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తాం. మాకున్న సమాచారం మేరకు త్వరలోనే పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి.
పద్మజారమణ, జిల్లా మహిళా సంక్షేమ అధికారి
Comments
Please login to add a commentAdd a comment