ఓరుగల్లు యాదిలో ‘శకుంతల’
పోచమ్మమైదాన్ : తెలంగాణ యాస, భాషతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినీనటి శకుంతల శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందడంతో జిల్లాకు చెందిన ఆమె అభిమానులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామీ ణ ప్రాంతాల ప్రజలు మాట్లాడుకునే భాష ను యథాతదంగా వినిపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శకుంతల ఆకస్మికంగా కన్నుమూయడంతో చాలామంది ఆవేదనకు లోనయ్యారు. ‘మా భూమి’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించిన శకుంతల.. ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా ఎదిగింది. డెరైక్టర్ తేజ రూపొందించిన ‘నువ్వునేను’ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
అయితే అప్పటి నుంచి చాలా సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న శకుంతల ఇటీవల ‘పాం డవులు పాండవులు తుమ్మెద’లో బామ్మ పాత్ర చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుం ది. ఇదిలా ఉండగా, 1996 సంవత్సరంలో ‘ఉద యం టెలీఫిలిం’ షూటింగ్‌లో భాగంగా ఆమె వరంగల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె దేశాయిపేట లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నారు. అలాగే జిల్లా లో పలుమార్లు జరిగిన నాటకాల ప్రదర్శనకు కూడా హాజరయ్యారు. కాగా, 2012 సంవత్సరంలో ఓ టీవీ చానల్ వరంగల్‌లో నిర్వహించిన వంటల ప్రోగాం కు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె ‘సాక్షి’తో చిట్‌చాట్ చేశారు. కాగా, ఉదయం టెలిఫిలీంకు దర్శకత్వం వహించిన టీవీ ఆశోక్ శకుంతల మరణవార్త విని తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
దిగ్భ్రాంతికి గురైన డోర్నకల్ వాసులు
డోర్నకల్ : సినీనటి తెలంగాణ శకుంతల మృతివార్తను తెలుసుకున్న డోర్నకల్ వాసులు శనివారం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 2009 ఫిబ్రవరి 9వ తేదీన పట్టణంలో ఏర్పాటు చేసిన వెన్నెల ఫ్యూరిఫైడ్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించేందుకు శకుంతల డోర్నకల్‌కు వచ్చారు. ఆ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు డోర్నకల్‌లో గడిపిన శకుంతలను చూసేందుకు చాలామంది వచ్చారు. అయితే తనవద్దకు వచ్చిన వారితో ఆమె ఆప్యాయంగా మాట్లాడి ఫొటోలు దిగింది. కాగా, ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం తెలంగాణ యాసలో మాట్లాడగా స్థానికులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇది లా ఉండగా, శకుంతల మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని వెన్నెల వాటర్‌ప్లాంట్ నిర్వాహకురాలు బానోత సరళ అన్నారు.