
ఎప్పటికీ జగన్ నాయకత్వంలోనే ఉంటా...
ఖమ్మం: వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తాము ఎప్పటికీ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తామని, పార్టీ మారాల్సిన అవసరం తమకు లేదని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ స్పష్టం చేశారు. గిరిజన ప్రజాప్రతినిధులైన తమపై కావాలనే కుట్రపూరితంగా కొన్ని శక్తులు దుష్ర్పచారం చేస్తున్నాయని అన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసమే మొదటి నుంచి వైఎస్సార్ సీపీలో అంకితభావంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం గెలిచి వైఎస్సార్ సీపీ జిల్లాలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. జిల్లా పార్టీని బలోపేతం చేసేందుకు మరింతగా కృషి చేస్తున్నామన్నారు. దీన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం జగన్‌తో కలిసి ఢిల్లీలోనే ఉన్నారని చెప్పారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు రాజన్న ముఖ్యమంత్రిగా ఉండగా పట్టాలు ఇచ్చి ఆదుకున్నారని, దీంతో ప్రజలు జిల్లాలో వైఎస్సార్‌సీపీని ఆదరించారన్నారు. 2019లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గిరిజన ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా కథనాలు ప్రచురించే పత్రికలపై చట్టపరమైన చర్యలకు సైతం వెనుకాడేది లేనది హెచ్చరించారు.