సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసీ కార్మిక సంఘాలు
హైదరాబాద్, విజయవాడ బ్యూరో: హైకోర్టు ఆదేశాల తరువాత కూడా సమ్మెను కొనసాగిస్తామని ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె విరమించాలంటూ హైకోర్టు ఆదేశించిన దరిమిలా బుధవారం మరోసారి కోర్టులో తమ వాదనలు వినిపించాలని నిర్ణయించాయి. ఆ తరువాత హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని తీర్మానించుకున్నాయి. మంగళవారం ఆర్టీసీలోని పలు కార్మిక సంఘాలు ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించాయి.
ఈయూ- టీఎంయూ నాయకత్వం సహా తెలుగు రాష్ట్రాల్లో సమ్మెకు మద్దతు పలికిన అన్ని సంఘాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. బుధవారం ఏపీలో అన్ని డిపోల వద్ద నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపాలని కార్మికసంఘ సమావేశంలో నిర్ణయిం చారు. ఆర్టీసీ సమ్మె మంగళవారం ఏపీలో ప్రశాంతంగా కొనసాగింది. కార్మికులు ఆర్టీసీ అధికారులకు వ్యతిరేకంగా కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.