చేవెళ్ల: ‘చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో బీసీ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి.. లేదంటే పార్లమెంటు గోడలను బద్దలు కొడతాం’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన బీసీ గర్జనలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా బీసీలు అన్ని రంగాల్లోనూ అణచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కినప్పుడే బాగుపడతారని చెప్పారు. ‘చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నాం. ఉద్యమాలు చేస్తున్నాం. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని కోరితే 36 పార్టీలున్న పార్లమెంటులో ఏ రాజకీయ పార్టీ కూడా నోరు మెదపడం లేదు’ అని ఆరోపించారు. అవసరమైతే హక్కుల కోసం రాజస్తాన్‌లో గుజ్జర్లు చేసినట్లు పోరాటం చేస్తామని హెచ్చరించారు