సిద్దిపేట అర్బన్: ఈప్రపంచంలో ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదని, అలాంటి విలువైన ప్రాణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా నిలిపేందుకు ప్రతి వాహనదారుడూ కృషి చేయాలన్నారు. డ్రైవర్‌కు తగినంత విశ్రాంతి, నిద్ర అవసరమన్నారు. విశ్రాంతి లేకుండా నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. డ్రైవర్లకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు వారిలో చైతన్యం నింపేందుకు ప్రతి ఏటా వారం రోజుల పాటు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
చిన్న చిన్న నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా వెళితే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. సెల్‌ఫోన్‌లు మాట్లాడుతూ, మద్యం సేవించి, సిగరేట్ తాగుతూ వాహనాలను నడిపితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారవుతారని హెచ్చరించారు. ప్రయాణికుల జీవితాలు తమ చేతుల్లో ఉన్నాయనే విషయాన్ని ప్రతి డ్రైవర్ గుర్తుంచుకోవాలని సూచించారు. ఆటోలకు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రద్దు చే సిన సీఎం కేసీఆర్, పాతబకాయిలు కూడా మాఫీ చేశారన్నారు. అందువల్ల పాత బకాయిలకోసం వారిని వేధించవద్దని అధికారులకు సూచించారు.
రోడ్ల నిర్మాణం కోసం రూ. 25 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ. 25 వేల కోట్లను మంజూరు చేసిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ నిధులతో ప్రతి పల్లె నుంచి మండల కేంద్రాలకు, పట్టణాలకు డబుల్ లేన్ల రోడ్లు వేస్తామని మంత్రి వెల్లడించారు. రాజీవ్ రహదారిపై రూ.800 కోట్లతో బైపాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితులకు చికిత్స అందించేందుకు ట్రామాకేర్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొన్నాల నుంచి సిద్దిపేట మీదుగా రంగీల దాబా సమీపంలోని రాజీవ్హ్రదారి వరకు ఆరు లేన్ల రోడ్డును రూ. 50 కోట్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ప్రమాదాలను నివారిద్దాం...
తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల వాహనాలుండగా, గత సంవత్సరం 7 వేల ప్రమాదాలు జరిగాయని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మమత ప్రసాద్ తెలిపారు. ఇక మెదక్ జిల్లాలో 2.20 లక్షల వాహనాలు ఉంటే, 700 ప్రమాదాలు నమోదయ్యాయన్నారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, ఓవర్ టేక్‌లను నివారిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ప్రమాదాలు జరిగితే బాధితులను ఆస్పత్రుల్లో చేర్పించాలని డ్రైవర్లకు సూచించారు. రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా నిలిపి అందరి మన్ననలను పొందుదామని పిలుపునిచ్చారు. అంతకుముందు రవాణా శాఖ క్యాలెండర్లను, డైరీలను, వాసవీక్లబ్ రూపొందించిన రోడ్డు భద్రత వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావును సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్, ఆర్టీఓ ఏసురత్నం, ఎంవీఐ అశోక్‌కుమార్, సీఐలు సైదులు, ప్రసన్నకుమార్, ఎస్‌ఐలు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.