ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కల్యాణలక్ష్మి పథకం జిల్లాలో ఆరు నెలలుగా పట్టాలెక్కడం లేదు. జాతిపిత గాంధీ జయంతి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం వివరాలు ఇంకా లబ్ధిదారుల ముంగిటకు చేరడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 25 రోజుల్లో ముగియనుండగా లబ్ధిదారుల ఎంపిక అంశం ఇంకా కొలిక్కి రావడం లేదు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వార్షికాదాయం 2లక్షల రూపాయల లోపున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహానికి రూ.51వేలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఏడాది అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి నుంచి పథకం అమల్లోకి వచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద అర్హులైన 3,550 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే పథకం నియమ నిబంధనలు, దరఖాస్తు విధానంపై లబ్ధిదారులకు అవగాహన కొరవడింది. మరోవైపు లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన కూడా పథకం పురోగతిపై అడ్డంకిగా మారింది. పథకం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా పథకం నియమ నిబంధనలకు సంబంధిత వర్గాలకు అవగాహన కొరవడింది.
విస్తృత ప్రచారం కల్పించాల్సిన అధికార యంత్రాంగం నేటికీ దృష్టి సారించడం లేదు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కేవలం 387 దరఖాస్తులు మాత్రమే కల్యాణలక్ష్మి పథకం కింద సాయం చేయాలంటూ అందాయి. వీటిలో 215 దరఖాస్తులను పరిశీలించి, మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 172 దరఖాస్తులు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. పథకం కోసం జిల్లాకు ఇటీవల రూ.6 కోట్లు మజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో రూ.1.09 కోట్ల మేర లబ్ధిదారులకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు.
కొరవడిన ప్రచారం
ఇటీవల జిల్లాను సందర్శించిన ఎస్సీ అభివృద్ధి సంస్థ డెరైక్టర్ ఎంవీ రెడ్డి కల్యాణలక్ష్మి పథకం అమలు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకం అమలును వేగవంతం చేసేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. పోస్టర్లు, హోర్డింగులు, కళాజాతా వంటి కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలపై దృష్టి సారించి ప్రచార కార్యక్రమాలు రూపొందించాల్సిందిగా సూచించారు. మరోవైపు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గ్రామైఖ్య సంఘాలు, అంగన్‌వాడీ కార్యకర్తలను కూడా కల్యాణలక్ష్మి పథకం ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కల్యాణల క్ష్మి పట్టాలెక్కేనా ?
Published Fri, Mar 6 2015 1:12 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement