సాక్షి, యాదాద్రి : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన పార్టీలు రేపోమాపో తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అందుకోసం అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి సారించాయి.
ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన భువనగిరి స్థానంలో రెండుసార్లు 2009, 2014లో ఎన్నికలు జరగగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చేరోసారి విజయం సాధించాయి. భువనగిరి ఎంపీ స్థానంనుంచి 2009లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అప్పటి మహాకూటమి అభ్యర్థి నోముల నర్సింహయ్యపై విజయం సాధించారు.
2014లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై గెలుపొందారు. వచ్చే నెల జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు సీపీఐ ప్రధానంగా బరిలో నిలవనున్నాయి. ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిపేందుకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.
టీఆర్‌ఎస్ నుంచి ప్రస్తుత ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సీటు తనకే ఖరారవుతుందన్న ధీమాతో ఆయన ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అధికారికంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించనప్పటికీ సీఎం కేసీఆర్ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమీక్ష సమావేశంలో బూర నర్సయ్యగౌడ్‌ను గెలిపించే బాధ్యతను వారికి అప్పగించారు.
ఈనెల 7న భువనగిరిలో జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశంలో కూడా బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిగానే వక్తల ప్రసంగాలు కొనసాగాయి. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. భువనగిరి టికెట్ కోసం సుమారు 30మంది అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అధిష్టానం ముగ్గురు పేర్లు పరిశీ లిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
పీసీసీ నుంచి ఏఐసీసీకి చేరిన జాబితాలో మధుయాష్కీగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభ్యర్థి ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌ల పేర్లను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఆపార్టీ యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.
మోదీ చరిష్మాతో పాటు, జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి తమకు అనుకూలమైన పవనాలు వీస్తాయని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఆపార్టీ అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టిన సీపీఐ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసే యోచనలో ఉంది. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆపార్టీ సమాయత్తమవుతోంది.
భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో గెలుపొందిన ఎమ్మెల్యేలు...
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. శాసనసభకు డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భువనగరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే నకిరేకల్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment