టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ పాలమూరు వాకిట ఎన్ని బుగ్గకార్లు షికారు చేస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. వివిధ రాజకీయ సమీకరణాలు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ‘గులాబీ దళపతి’ మంత్రి వర్గ జాబితాన్ని పకడ్బందీగా రూపొందించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జిల్లాలనుంచీ ఆశావహులు ఎక్కువగానే ఉండడంతో అదృష్టం ఎవరికి దక్కుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఉత్కంఠకు లోనవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మరో 24 గంటల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, మరోవైపు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సోమవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.
ఆయనతో పాటు ఎందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు, జిల్లా నుంచి ఎంతమందికి చోటు దక్కుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్ అనూహ్య ఫలితాలు సాధించింది. పధ్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. జిల్లా నుంచి మంత్రి వర్గం లో చోటు కోసం ముగ్గురు నేతలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. వీరిలో కనీసం ఇద్దరికి చోటు దక్కుతుందని భావిస్తున్నారు. మంత్రులు, వారు చేపట్టే శాఖలను కేసీఆర్ ఖరారు చేశారనే వార్తల నేపథ్యంలో జూపల్లి,ల క్ష్మారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే శ్రీనివాస్‌గౌడ్ అవకాశాలు క్లిష్టంగా మారనున్నాయి.
మధ్యాహ్నం కల్లా స్పష్టత
కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఆదివారం మధ్యాహ్నం తర్వాత స్పష్టత వస్తుందని సమాచారం. సోమవారం తనతో పాటు పదవీ స్వీకార ప్రమాణం చేసే మంత్రుల జాబితాను కేసీఆర్ ఆదివారం ఉదయం గవర్నర్‌కు అందజేసే అవకాశం ఉంది. మంత్రివర్గ జాబితాపై ఇప్పటికే స్పష్టత వచ్చిన ప్పటికీ ముందస్తుగా వెల్లడిస్తే పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గోప్యత పాటిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లా ఎమ్మెల్యేలకు ప్రభుత్వ విప్, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు దక్కే అవకాశం వుంది. జిల్లాలో భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పులో కేసీఆర్ కసరత్తు చేసినట్లు సమాచారం. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రధాన శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. లక్ష్మారెడ్డికి వ్యవసాయం, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ కేటాయిస్తార ని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ గులాబీ నేత పరిమితంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే జిల్లా నుంచి తొలి విడతలో జూపల్లి కృష్ణారావుకు మాత్రమే మెరుగైన అవకాశాలు ఉంటాయని అంచనా.
అదృష్టం ఎందరికో..!
Published Sun, Jun 1 2014 2:37 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement