సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తన పదవికి రాజీనామా చేయకుండా పార్టీ సమీక్షలు నిర్వహించడాన్ని సొంత పార్టీ నేతలు బాహాటంగానే తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన పొన్నాల.. ఇంకా ఆ పదవిని పట్టుకుని వేలాడటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. పొన్నాల తీరుకు నిరసనగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ టీ-పీసీసీ ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.
పొన్నాలను తప్పించకపోతే రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం పొన్నాల తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.