వన్యప్రాణుల పాట్లు
కరువు కాటుకు బలవుతున్న వైనం
గ్రామాల్లోకి చేరిన కోతులు అదే దారిలో మృగాలు
తాజాగాతుక్కాపూర్‌లో చిరుత అలజడి
మరికొన్ని చొరబడే ప్రమాదం
కరువు కాటేసింది. రెండేళ్లు సరిగా వర్షాలు లేకపోవడంతో రైతులు, ప్రజలే కాదు... వన్య ప్రాణులు సైతం ఇబ్బందుల్లో పడ్డాయి. నీటికోసం వన్య ప్రాణులు విలవిల్లాడుతున్నాయి. నీటి జాడల వైపు పరుగులు తీస్తున్నాయి. రిజర్వు ఫారెస్ట్‌లో తాగునీరు దొరక్క ఇప్పటికే కోతులు గ్రామాలు, పట్టణాల్లో చొరబడ్డాయి. వాటి దారిలోనే కొన్ని రకాల జంతువులు, క్రూర మృగాలు సైతం అడవులను వదిలి బయటకు వస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా మంగళవారం కొల్చారం మండలం తుక్కాపూర్‌లో ఓ చిరుత స్వైర విహారం చేసిన విషయం తెల్సిందే. ఇలాంటి ఘటనలు ఎప్పుడు ఎక్కడ వెలుగు చూస్తాయోనని జనం ఆందోళన చెందుతున్నారు.
- మెదక్
మెదక్: జిల్లాలో 250 ఎకరాలకుపైగా రిజర్వ్ ఫారెస్ట్, అభయారణ్యాలు, సామాజిక అడవులు ఉన్నాయి. ఇందులో అనేక రకాల జంతువులు వేల సంఖ్యలో ఉన్నాయి. గత రెండేళ్లుగా వర్షాలు లేక కరువు విలయతాండవం చేస్తోండడంతో అడవుల్లోని జంతువులు మేతతోపాటు గుక్కెడు నీటికోసం అలమటిస్తున్నాయి. ఆకలి, దాహం తీర్చుకునే దారిలేక రిజర్వ్ ఫారెస్ట్‌లను వదిలి పల్లెబాట పడుతున్నాయి.
గ్రామాలకు చేరిన కోతులు...
ఇప్పటికే కోతులు గ్రామాల్లోకి చేరుకొని పంటలు నాశనం చేస్తున్నాయి. ఇళ్లలో చొరబడి ప్రజలను రక్కుతూ.. నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. మెదక్ పట్టణంలో కోతుల బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు.
ఇప్పుడు చిరుతల వంతు...
ప్రస్తుతం చిరుత పులులు గ్రామాల్లో చొరబడుతుండడంతో ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి నెలకొంది. అడవులను వదిలి గ్రామాల్లోకి చొరబడటానికి ముఖ్య కారణం అడవులు అంతరించిపోవడం. వాటికి మేత, తాగునీరు లభించక పోవడమేనని పలువురు పేర్కొంటున్నారు. అడవులు రోజు రోజుకు అంతరించి పోతుండటంతో వన్య ప్రాణులకు మేత, తాగునీరు కరువై పల్లెల్లోకి చొరబడి ప్రజలపై దాడులు చేస్తున్నాయి. కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో మంగళవారం చిరుత సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. తొమ్మిది మందిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన విషయం తెల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అడవులను పెంచడంతోపాటు వాటిని నరకకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
వన్యప్రాణుల రక్షణలో అధికారుల నిర్లక్ష ్యం...
గత రెండేళ్లుగా వర్షాలు లేక రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. దీంతో రిజర్వు ఫారెస్ట్‌లోని జంతువులు నీటి కోసం అల్లాడుతున్నాయి. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో అనేక చోట్ల సాసర్ పిట్లు నిర్మించారు. కానీ వాటిల్లో నీటిని నింపక పోవడంతో వన్యప్రాణులకు తాగునీరు దొరకడం లేదు. ఈ విషయమై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రిజర్వు ఫారెస్ట్‌లో జంతువుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటుచేసిన సాసర్ పిట్లలో నీటిని నింపి వాటి దాహం తీర్చాల్సిన అవసరం ఎంతైన ఉంది.
నీటికోసం విలవిల
Published Wed, Dec 2 2015 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM
Advertisement
Advertisement