ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఈ ఏడాది రూ. 5,751 కోట్లు నష్టపోయాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఉదారంగా ఆర్థికసాయం చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బడ్జెట్‌లో నిధుల కోత, పెండింగ్ బకాయిల కారణంగా రాష్ట్రం ఈ ఏడాది రూ.5,751 కోట్లను నష్టపోయిందని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా రాష్ట్రానికి ఆంక్షలు లేని నిధులు మంజూరు చేయాలని కోరుతూ గురువారం కేంద్రానికి లేఖ రాసింది. రెండు రోజుల కింద కింద ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ లేఖను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందించారు. కేంద్రం పన్నుల వాటాలో తెలంగాణకు పంపిణీ చేసే శాతాన్ని 2.89 నుంచి 2.43 శాతానికి తగ్గించిందని.. దీంతో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రం దాదాపు రూ.16 వేల కోట్లు నష్టపోతుందని పేర్కొన్నారు. అందులో ఈ ఒక్క ఏడాదిలోనే రూ.2,389 కోట్లు నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం దేశంలో ఏడు రాష్ట్రాలు రూ.10,135 కోట్ల నుంచి రూ.27,690 కోట్లను వాటాగా పొందగా... కొత్త రాష్ట్రమైన తెలంగాణకు మాత్రం పన్నుల ఆదాయంలో వాటాను తగ్గించారు. మరోవైపు రాష్ట్రాలకు పన్నుల వాటాను పదిశాతం పెంచిన సాకుతో కేంద్రం ప్రాయోజిత పథకాల నిధులకు భారీగా కత్తెర వేసింది. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణకు రూ.2,233 కోట్లు కోత పడింది. దీంతో రాష్ట్రం ఆర్థికంగా సమస్యల్లో చిక్కుకుంది. మొత్తంగా పన్నుల వాటా, పథకాల నిధులు వెరసి కేంద్రం నుంచి రావాల్సిన రూ.4,622 కోట్లు నిలిచిపోయాయి. ఇదేగాకుండా దాదాపు 20 కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులు కూడా బాగా పెరిగిపోయాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక ప్యాకేజీని అందించాలని ఆర్థిక శాఖ కేంద్రానికి రాసిన లేఖలో వివరించింది.
స్థానిక సంస్థలకు నిధులివ్వండి..
మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేసే 13వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని స్థానిక సంస్థలు నిధుల సంక్షోభంలో కూరుకుపోయాయని పేర్కొంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి మరో లేఖ రాసింది. రాజ్యాంగబద్ధమైన ఈ గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలకు రూ.778.72 కోట్లు రావాల్సి ఉందని ఈ లేఖలో ప్రస్తావించింది. మొత్తంగా 13వ ఆర్థిక సంఘం బకాయిలు రూ.1,129.93 కోట్లుగా ఉన్నాయని.. ఇప్పటికే చేపట్టిన పనులకు అవసరమైన బిల్లుల చెల్లింపునకు వీలుగా ఈ నిధులు విడుదల చేయాలని పేర్కొంది.