జైట్లీతోచంద్రబాబు, సుజనా చౌదరి(పాత ఫొటో)
సాక్షి, అమరావతి: ఐదు కోట్ల ఆంధ్రులను మరోసారి మోసం చేయాలనుకున్న టీడీపీ పన్నాగం గుట్టురట్టైంది. పైపైకి ప్రత్యేక హోదా పోరాటం చేస్తున్నట్లు నటిస్తోన్న పచ్చ నేతలు.. లోలోన మాత్రం ప్యాకేజీ కోసం ఆరాటపడుతూ, ఆ మేరకు కేంద్ర మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోన్నవైనం తేటతెల్లమైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో అన్నీ తానై వ్యవహరించే సుజనా చౌదరి.. బీజేపీ కీలక నేత, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రహస్యంగా భేటీ అయ్యారన్న సమాచారం టీడీపీలో కలవరం రేపుతోంది. శుక్రవారం ఉదయం చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ‘రహస్య భేటీ’ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.
హోదా వద్దు.. ప్యాకేజీకే మొగ్గు?: ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక వ్యక్తం కావడంతో అనివార్యంగా హోదా పోరాటంలోకి దిగిన టీడీపీ.. ఇప్పుడు మళ్లీ ప్యాకేజీకే జై కొట్టనున్నట్లు తెలిసింది. గడిచిన మూడు రోజులుగా జరిగిన పరిణామాలు యూటర్న్ నిజమేననే సంకేతాలిచ్చినట్లైంది. చంద్రబాబు దూతగా సుజనా చౌదరి బుధవారం రాత్రి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని రహస్యంగా కలుసుకున్నారని తెలిసింది. గతంలో ప్రకటించిన ప్యాకేజీ నిధులను తక్షణమే విడుదల చేస్తే.. బీజేపీ-టీడీపీలు తిరిగి ఏకమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని దూత వివరించినట్లు సమాచారం. ముందస్తుగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.1400 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించడం కూడా ‘లాలూచీ’లో భాగమేనని తెలుస్తోంది. టీడీపీ-బీజేపీ రీయూనియన్‌కు సంబంధించి ఈ మేరకు చంద్రబాబు అనుకూల మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు రావడం గమనార్హం.
అలా ఎలా కలుస్తారు?: ‘రహస్య భేటీ’పై శుక్రవారం నాటి టెలీకాన్ఫరెన్స్‌లో తీవ్ర దుమారం చెలరేగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జైట్లీతో భేటీపై సుజనా, చంద్రబాబు, యనమలలు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖ రైల్వే జోన్, ఉక్కు ఫ్యాక్టరీలప క్లారిటీ కోసమే జైట్లీ చాంబర్‌కు వెళ్లానని సుజనా వివరణ ఇచ్చుకున్నారని, హోదా కోసం పోరాటం జరుగుతున్న సమయంలో ఇలాంటి సమావేశాల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని యనమల అన్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. దానికి చంద్రబాబు.. ఎవరు ఎవరితోనైనా మర్యాదపూర్వకంగా కలిసి, మాట్లాడొచ్చని, అయితే తనకు తెలియకుండా వెళ్లడం సరికాదని అన్నట్లు తెలిసింది.
బాబుకు తెలియకుండా వెళతారా?: ప్యాకేజీ కోసమే జైట్లీతో సుజనా భేటీ అయ్యారన్న సమాచారం రట్టుకావడంతో టీడీపీ వర్గాల్లో ఒక్కసారే కలకలంరేగింది. టీడీపీకి సంబంధించి ఢిల్లీలో అన్ని వ్యవహారాలను అధికారికంగా చూసుకునే సుజనా చౌదరి... చంద్రబాబుకు తెలియకుండా జైట్లీతో భేటీ అవుతారని నమ్మలేమని, ఖచ్చితంగా ఏదో జరుగుతోందని టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment