
పోలవరం బాధితులను ఆదుకోండి: తాటి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని వైసీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజనులు, అక్కడి ఉద్యోగులు తీవ్ర ఆందోళన లో ఉన్నారని, శాసనసభ వేదికగా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. వారందరికీ తెలంగాణలోనే పునరావాసం కల్పించాలని కోరారు. ఏడుమండలాలు ఆంధ్రప్రదేశలో విలీనమయ్యాయనే సాకుతో బూర్గంపాడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని.. జెడ్పీటీసీకి అర్హత లేకుండా చేయటం అన్యాయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రస్తావిం చారు.
ఆ ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచేందుకు గత సమావేశాల్లో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతామని చెప్పిన ముఖ్యమంత్రి.. అది ముగిసిన అధ్యాయమని చేతులు దులుపుకొన్నారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వమే విలీన మండలాల్లోని ప్రజల సంక్షేమ బాధ్యతలను పట్టించుకోవాలని.. పథకాలను అమలు చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, టీడీపీలు కుట్ర పూరితంగా ఏడు మండలాలను కబళించాయని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. స్పందించిన మంత్రి ఈటెల మాట్లాడుతూ ఆంధ్రలో విలీనం చేసిన ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ విషయమై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు.