
ఆడ బిడ్డలను చదివిద్దాం..
* త్వరలో కాళేశ్వరం బ్రిడ్జి ప్రారంభం
* కరీంనగర్‌కు స్మార్ట్ హోదాకు కృషి
* మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు
కరీంనగర్ : దేశంలో ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గుతోందని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను గర్భంలోనే చంపేయొద్దని, వారిని బాగా చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ 2025 నాటికి ప్రపంచ జనాభాలో 29 ఏళ్ల వయస్సుగల జనాభా ఎక్కువగా భారత్‌లోనే ఉంటుందన్నారు. ఇందులో ఆడపిల్లల సంఖ్య కూడా ఎక్కువగా ఉండాలని, ఆడబిడ్డలను కడుపులోనే చంపేసే సంస్కృతిని విడనాడాలని సూచించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను కలిపే కాళేశ్వరం బ్రిడ్జి నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, ఆగస్టులో వంతెన రెండు రాష్ట్రాలకు సులువుగా రాకపోకలు కొనసాగుతాయని అన్నారు.
తెలంగాణ బిడ్డల అలుపెరగని పోరాటాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిందన్నారు. దాంతో హైదరాబాద్‌కు ప్రపంచంలోనే మంచి గుర్తింపు వచ్చిందన్నారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మార్చాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరానన్నారు. నగర మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో మంత్రి ఈటెల, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాసరలోని సరస్వతీ అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు శనివారం దర్శించుకున్నారు.
సామాజిక సేవ చేయండి
బాసర: ప్రతి ఒక్కరూ సామాజిక సేవపై దృష్టి సారించాలని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం ఆయన బాసరలోని అఖిల భారత వెలమ సంఘం ఆధ్వర్యంలో వోని ధర్మయ్య వెలమ చౌల్ట్రీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వెలమ సంఘ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. బాసరలో భక్తుల సౌకర్యర్థం మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున అతిథి గృహాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సానూకులంగా స్పందించారు. ఎమ్మె ల్యే దివాకర్‌రావు, అఖిల భారత వెలమ సంఘం అధ్యక్షుడు భానుప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.