ఎస్‌బీఐ ఖాతాలోంచి రూ.58 వేలు డ్రా..
నివ్వెరపోయిన ఖాతాదారులు
ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
సాంకేతిక పరిజ్ఞానంతో మోసం
కొడంగల్ పోలీసులకు ఫిర్యాదు
కొడంగల్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరుగుతున్న కొద్ది మోసాలు ఆ స్థాయిలోనే పెరుగుతున్నాయి. కొందరు దుండగులు అమాయకుల ఖాతా నంబర్లను తెలుసుకొని, వారిని నిలువునా మోసం చేస్తున్నారు. వారు ఖాతాలోంచి డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం కొడంగల్ ఎస్‌బీఐ ఖాతాలో చోటుచేసుకున్న సంఘటన. ఈ సంఘటన జరిగి మూడు రోజులైంది. ఖాతాదారుల అమాయత్వంవల్ల మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొడంగల్, బొంరాస్‌పేట మండలాలకు చెందిన ఇద్దరు ఖాతాదారుల ఖాతాలోంచి మూడురోజుల క్రితం గుర్తుతెలియని మోసగాళ్లు రూ.58వేలు డ్రా చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
బాధితులు, బ్యాంకు మేనేజర్ కథనం ప్రకారం వివరాలు.. కొడంగల్‌కు చెందిన ఆరీఫ్, బొంరాస్‌పేట మండలం లింగన్‌పల్లి గ్రామానికి చెందిన నర్సిములుకు కొడంగల్ ఎస్‌బీఐలో ఖాతాలు ఉన్నాయి. మూడురోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు వీరికి ఫోన్ చేసి సైబర్ నేరానికి పాల్పడ్డారు. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మొదటగా ఏటీఎమ్ కార్డు నంబర్, తర్వాత పిన్ నంబర్ అడిగారు. కొన్ని నిమిషాల వ్యవధిలో సెల్ నంబర్‌కు వచ్చిన మెసేజ్ (వన్ టైమ్ పాస్‌వర్డ్) ఓటీపీ నంబర్‌ను అడిగారు.
దీంతో వెంటనే ఆరీఫ్ ఖాతా నుంచి రూ.11వేలు, నర్సిములు ఖాతా నుంచి రూ.47,333 డ్రా చేసుకున్నారు. నిందితులు డబ్బులు డ్రా చేసే విషయంలో జాగ్రత్తపడ్డారు. డబ్బులను నేరుగా డ్రా చేయకుండా ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా డబ్బులు దండుకున్నట్లు మేనేజర్ హరికృష్ణ తెలిపారు. డబ్బులు కోల్పోయిన బాధితులు కొడంగల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.
ఆన్‌లైన్ షాపింగ్‌తో మోసం
Published Wed, Aug 12 2015 12:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement