కలుషిత ఆహారంతో బాలికలకు అస్వస్థత | with the contaminated food sickness to girls | Sakshi
Sakshi News home page

కలుషిత ఆహారంతో బాలికలకు అస్వస్థత

Published Wed, Jul 30 2014 11:59 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

కలుషిత ఆహారంతో బాలికలకు అస్వస్థత - Sakshi

కలుషిత ఆహారంతో బాలికలకు అస్వస్థత

కుల్కచర్ల: కలుషిత ఆహారం తినడంతో ‘కస్తూర్బా’ పాఠశాలలోని 30 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురికి ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన కుల్కచర్లలో బుధవారం చోటుచేసుకుంది. విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారి తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకులు పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవడంతో మధ్యాహ్నం పరిగి-మహబూబ్‌నగర్ రహదారిపై బైఠాయించారు. వివరాలు.. కుల్కచర్లలోని ‘కస్తూర్బా’ పాఠశాలలో 198 మంది బాలికలు చదవుకుంటున్నారు.
 
భోజనం సరిగా లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని కొంతకాలంగా బాలికలు ఆందోళన చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నాయకులు, మూడు రోజుల క్రితం తహసీల్దార్, ఎంఈఓ తదితరులు పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. వంటవారిని హెచ్చరించి వెళ్లారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి సిబ్బంది అన్నంతో పాటు తోటకూర చారు చేసి విద్యార్థులకు వడ్డించారు. అర్ధరాత్రి బాలికలు రాధిక(6వ తరగతి), భారతి (6వ), సురేఖ (9 వ), జయమ్మ (10 వ), లక్ష్మి (9వ), అనూష (9వ), మనూష (7 వ), రాధ, సుష్మ(8వ తరగతి)లకు కడుపునొప్పి, తీవ్ర జ్వరం వచ్చింది. పాఠశాలలోని  ఏఎన్‌ఎం లక్ష్మి బాలికలకు మందులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.
 
బుధవారం ఉదయం వరకు సదరు విద్యార్థులతో పాటు మొత్తం సుమారు 30 మంది విద్యార్థులు కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుల్కచర్ల పీహెచ్‌సీ నుంచి వైద్యులు వచ్చి చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం ఐదు మందిని కుల్కచర్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారికి స్కూల్‌లో సెలైన్లు పెట్టి చికిత్స చేశారు.
 
కాగా అన్నంలో సొడా, సున్నం కలపడంతో తాము అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు తెలిపారు. కాగా మంగళవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులే అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీటితోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థులకు మంచినీరు సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంక్‌లో పూర్తిగా నాచుపేరకుపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటామని గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
 
బాధ్యులపై చర్యలు..
విద్యార్థులు అస్వస్థతకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి దశరథ్‌నాయక్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయనతో పాటు జిల్లా డీటీడబ్ల్యూఓ అధికారి శివప్రసాద్ తదితరులు కస్తూర్బా పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు.
 
నాలుగు రోజులుగా సరిగా తిండి లేదని విద్యార్థులు ఆయనతో చెప్పారు. కుక్‌లను తొలగించి కొత్తవారిని ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు.
 
ప్రమాదం ఏమి లేదు..
కలుషితమైన ఆహారం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికి ఎవరికీ ఏ ప్రమాదం లేదు. బాలికలు పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉండి చికిత్స చేస్తాం. అందరికి మందులు ఇస్తున్నాం.  
సాయిలక్ష్మి, వైద్యురాలు కుల్కచర్ల పీహెచ్‌సీ  
 
అన్నం తిన్న గంట తర్వాతి నుంచి..  
మంగళవారం రాత్రి అన్నం, చారు తిన్నాం. కొద్దిసేపు చదువుకున్నాం. గంట తర్వాత కడుపునొప్పి వచ్చింది. జ్వరం కూడా వచ్చింది. అసలేం జరిగిందో తెలియదు.
 కవిత, 10 తరగతి
 
నాలుగు రోజులుగా సరిగా తిండిలేదు.
నాలుగు రోజులుగా పాఠశాలలో సక్రమంగా తిండిలేదు. అ న్నం సరిగా వండడం లేదు. మంగళవారం రాత్రి అన్నంలో సొడా, సున్నం వేశారు. భోజనం చేసేట ప్పుడు వాసన వచ్చింది. అందుకే కొంచమే తిన్నాం.               
 కోమలి, 9వ తరగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement