ప్రమాదంలో కాలిపోయిన గుడిసె
రాయపోలు(దుబ్బాక): ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో ప్రజలకు విద్యుత్ ప్రమాదం కంటిమీద కునుకులేకుండా చేసింది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపంతో ప్రమాదం సంభవించింది. దీని వల్ల విద్యుత్ షాక్‌తో ఓ మహిళ మృతిచెందగా, ఒక పూరిగుడిసె దగ్ధమైంది. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన తాటికొండ కళవ్వ (53) సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలో మృతి చెందింది.
ఇదిలా ఉండగా కళవ్వను తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన ఆమె భర్త తాటికొండ నర్సింహులు తన కొడుకు నవీన్‌తో కలసి తిరిగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చాడు. అప్పటికే అతని కోడలు మహేశ్వరి గుడిసెలో నిద్రిస్తోంది. ఆ సమయంలో గుడిసెలో నుంచి పొగలు రావడం గమనించిన వారు వెంటనే మహేశ్వరిని బయటకు తీసుకొచ్చారు. అంతలోనే గుడిసెకు మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలు చల్లార్చారు. అప్పటికే గుడిసె పైకప్పు కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని టీవీ, ఇతర వస్తువులు కాలిపోయాయి. వీటితో పాటు నగదు కూడా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. గుడిసెలోని విద్యుత్ స్విచ్‌బోర్డు నుంచి స్పార్క్స్ వచ్చి నిప్పంటుకున్నట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment