ఖమ్మంక్రైం: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఖమ్మంలో సంచలనం రేకెత్తించింది. ఖమ్మం అర్బన్ పోలీసుల కథనం ప్రకారం.. ఖానాపురం హవేలి ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో రాజీవ్‌నగర్ గుట్ట ప్రాంతంలో నివసిస్తున్న పాలపాటి కాంతమ్మ(43) భర్త కృష్ణ 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె స్థానిక ఎస్‌ఎస్‌జీకే గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తూ జీవిస్తోంది. పెద్ద కుమారుడు వెంకటేష్ హైదరాబాద్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా చిన్నకుమారుడైన హరీష్ రాజమండ్రిలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. కాంతమ్మ ఒంటరిగా కుంటోంది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఆ ప్రాంతంలో నివసిస్తున్న దామల్ల సుగుణ స్థానిక చర్చిలో ప్రార్థనకు హాజరై తిరిగి వస్తోంది.
ఈ క్రమంలో కాంతమ్మ తన ఇంటిముందు రక్తం మడుగులో పడి ఉండడాన్ని గమనించి గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కలవారు వచ్చి 108అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది పరిశీలించి ఆమె అప్పటికే మృతిచెందిదని తెలిపారు. గొంతుకోసి, ముఖంపై తీవ్రంగా గాయపర్చి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో అనుమానితుడు..
కాంతమ్మ మృతదేహం పక్కన నన్నబోయిన నాగరాజు అనే యువకుడు కూర్చోని ఉన్నాడు. దీంతో నువ్వు ఇక్కడ ఎందుకు వున్నావుంటూ మొదట మృతదేహాన్ని గమనించిన సుగుణ ప్రశ్నించింది. కాంతమ్మను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చంపుతుండగా గట్టిగా కేకలు వేసిందని, అందుకే వచ్చానంటూ పొంతన లేకుండా మాట్లాడాడు. దీంతో స్థానికులు అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సైతం పొంతన లేకుండా సమాధానం చెబుతుండటంతో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. కత్తి కూడా కాంతమ్మ చీర కొంగు కిందనే పడి ఉండటంతో పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. నాగరాజు ఓ దినపత్రిక(సాక్షి కాదు)లో సర్క్యూలేషన్ విభాగంలో పనిచేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు కాంతమ్మ, నాగరాజులు కొంతకాలంగా çసన్నిహితంగా ఉంటున్నారని, ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు సైతం తలెత్తుతున్నాయని తెలిసింది. పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా డాగ్ కూడా నాగరాజు వద్దకు చేరుకుని ఆగిపోవటంతో అతడిన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఖమ్మం అర్బన్ సీఐ సాయిరమణ వివరణ కోరగా.. హత్య సంఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు. సంఘటనాస్థలాన్ని ఏసీపీ వెంకట్రావు సందర్శించారు. మృతురాలి కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment