
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు కోసం కృషి చేయాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం అసెంబ్లీలో సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఓ బృందం సీఎం కేసీఆర్‌ను కలిసింది. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసినా, ఆ తర్వాత ప్రక్రియ చేపట్టలేదని, ప్రధాని మోదీతో చర్చించి పార్లమెంటులో బీసీబిల్లు పెట్టడానికి చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య కోరారు.
56% జనాభా ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో 14% వాటా కూడా లేదని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాల్సిన అవసరముంద న్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. బీసీ పారిశ్రామిక పాలసీని ప్రకటించి పూర్తి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 50 శాతానికి పెంచాలని, క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలని కోరారు. ఈ డిమాండ్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు. త్వరలో ప్రధానిని కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment