అక్టోబర్‌కల్లా యాదాద్రి ఆలయం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణాన్ని అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. అసెంబ్లీలో గురువారం ఈ అంశంపై సభ్యులు గాదరి కిషోర్ కుమార్, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఏడు గోపురాల నిర్మాణం, లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్, వ్రత మండపం, మాడవీధి, బ్రహ్మోత్సవ ప్రాంతం, ముఖ మండపం, ప్రాకారాల పనులు పురోగతిలో ఉన్నాయని కేటీఆర్ వివరించారు. వైటీడీఏ పరిధిలోకి యాదగిర్‌పల్లి, సైదాపూర్, రాయ్‌గిరి, మళ్లాపూర్, దాతర్‌పల్లి, గుండ్లపల్లి, బశ్వపుర గ్రామాలను తెస్తున్నట్లు తెలిపారు. యాదాద్రిలో రోప్‌వే ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్లు వివరించారు.
‘అన్నపూర్ణ’గా రూ. 5 భోజన కేంద్రాలు
రూ. 5 భోజన కేంద్రాలకు ‘అన్నపూర్ణ’గా పేరు ఖరారు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 109 భోజన కేంద్రాలు నడుస్తున్నాయని, వాటిని 150కి విస్తరిస్తామన్నారు. కంటోన్మెంట్ పరిధిలో ఐదారు భోజన కేంద్రాలు పెడతామని హామీ ఇచ్చారు.